ప్రతిభకు పరీక్ష
న్యూఢిల్లీ : 2009 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఈ నెల 16న (శనివారం) జరుగుతుంది. ఫలితాలు వెలువడిన తరువాత అందరి చూపులూ రాష్ట్రపతి భవన్ పైనే కేంద్రీకృతం కాగలవు. హంగ్ పార్లమెంట్ ఏర్పడే అవకాశాలు పెరుగుతున్నందున రాష్ట్రపతి ప్రతిభా దేవీసింగ్ పాటిల్ ముందున్న కర్తవ్యం ఏమిటి? హంగ్ పార్లమెంట్ ఏర్పడిన పక్షంలో రాష్ట్రపతి ముందుగా ఎవరిని పిలుస్తారు? ఎవరు ప్రధాని కాగల అవకాశాన్ని ముందు చేజిక్కించుకుంటారు?
అటువంటి పరిస్థితిపై రాజ్యాంగంలో ప్రస్తావనేదీ లేదు. ప్రభుత్వానికి సుస్థిరత, చట్టబద్ధత ఉన్నప్పటికీ సభలో అవి లెక్కలోకి రావు. రాష్ట్రపతులు ఆర్. వెంకట్రామన్, శంకర్ దయాళ్ శర్మ వరుసగా 1989, 1996 ఎన్నికల అనంతరం చేసినట్లుగా సభలో ఏకైక పెద్ద పార్టీని ఆహ్వానించాలని కొందరు ప్రవీణులు సూచిస్తున్నారు. 'ఎన్నికల ముందు పొత్తు కుదుర్చుకున్న, సంఖ్యాధిక్యం ఉన్న పార్టీని పిలవాలి. అయితే, ఎన్నికల అనంతర సంకీర్ణాలకు నేను సుముఖుడిని కాను. ఎందుకంటే అటువంటి సంకీర్ణాలు అవకాశ వాదంతోనే ఏర్పాటై ఉంటాయి' అని మాజీ అటార్నీ జనరల్ సోలి సోరాబ్జీ సూచించారు.
అయితే, 2009 ఫలితాలు 1989లో వలె ఉండకపోవచ్చు. 1998లా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్పష్టత లేని ఫలితాలు వచ్చి, హంగ్ సభ ఏర్పాటు కావచ్చు. ఎన్నికల ముందు కూటములకు లోక్ సభలో సాధారణ మెజారిటీకి కావలసిన 273 స్థానాలు రాకపోవడంతో 1998లో అప్పటి రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ అతి జాగ్రత్తగా వ్యవహరించారు. నారాయణన్ వైఖరి ఆనాటి పరిస్థితులకు అనువుగా ఉందని రాజ్యాంగ ప్రవీణులు అంటున్నారు. 'సుస్థిరత కోసం అతి పెద్ద కూటమినే పిలవవలసి ఉంటుంది. చివరకు ఎలా అయినా విశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనవలసి ఉంటుంది కనుక అదేమీ సమస్య కాదు' అని సుప్రసిద్ధ న్యాయవాది, రాజ్యాంగ నిపుణుడు రాజీవ్ ధావన్ అభిప్రాయం వెలిబుచ్చారు.
మరి వెంకట్రామన్ - శర్మ విధానాన్నే అనుసరిస్తారా లేక నారాయణన్ పద్ధతిలో వెళతారా? ఈ ప్రశ్నకు సమాధానం ఈ నెల 16 తరువాతే వస్తుంది. ఎవరిని పిలవాలో నిర్ణయించుకోవడం రాష్ట్రపతి ప్రతిభ తీర్పునకు, రాజకీయ నిష్పాక్షికతకు పరీక్ష కాగలదు. అయితే, ఒక విషయం మాత్రం స్పష్టం. 2009 సార్వత్రిక ఎన్నికల చివరి అధ్యాయానికి రచన రైజినా హిల్ లోని ఆమె నివాసంలోనే జరుగుతుంది. తదుపరి ప్రధాని ఎవరా అనే ఉత్కంఠ అప్పుడే తెగుతుంది.
News Posted: 11 May, 2009
|