బాబుదే తప్పన్న కేడర్
హైదరాబాద్ : తెలుగు దేశం పార్టీ (టిడిపి)లో ప్రస్తుతం సాగుతున్న సమీక్ష సమావేశాలు పార్టీ ముఖ్య నేతలను కొంత ఇరకాటంలోకి నెడుతున్న సూచనలు గోచరిస్తున్నాయి. ఏదైనా అసెంబ్లీ సెగ్మెంట్ లో 'పార్టీ పరిస్థితి' దారుణంగా ఉన్నట్లయితే స్థానిక నాయకులే బాధ్యత వహించవలసి వస్తుందని పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఒకవైపు స్పష్టం చేయగా టిడిపి సీనియర్ నాయకుడు, ప్రకాశం జిల్లా అద్దంకి శాసనసభా స్థానానికి పార్టీ అభ్యర్థి కరణం బలరామకృష్ణ మూర్తి అనుచరులు ధైర్యంగా ఎదురు వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
సోమవారం హైదరాబాద్ లో అద్దంకి సమీక్షా సమావేశంలో మూర్తి అనుచరులు మాట్లాడుతూ, ఈ సెగ్మెంట్ లో ఏదైనా వ్యతిరేక ఫలితం సంభవిస్తే నిందార్హుడు చంద్రబాబు నాయుడే అవుతారని, ఎందుకంటే చివరి క్షణం వరకు అభ్యర్థిని ఆయన నిర్ణయించలేదని వ్యాఖ్యానించారు. 'మూర్తి, గరటయ్య ఇద్దరికీ చంద్రబాబు నాయుడు టిక్కెట్ వాగ్దానం చేశారు. చివరకు మూర్తి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. దీనితో గరటయ్య ఆయనకు వ్యతిరేకంగా పని చేశారు' అని వారు ఈ అస్తవ్యస్త పరిస్థితికి పార్టీ అధినేతనే బాధ్యుడిని చేస్తూ చెప్పారు. సమావేశానికి హాజరైన బలరామకృష్ణ మూర్తి తన అనుచరులను శాంతింపచేయడానికి ప్రయత్నించారు. పార్టీలో గరటయ్య కొనసాగేట్లు చూసేందుకు చంద్రబాబు చేసిన కృషిని మూర్తి శ్లాఘించారు.
కాగా, ఈ నిందాగర్భిత వ్యాఖ్యలు ఒక్క సెగ్మెంట్ కే పరిమితం కాలేదు. వాస్తవానికి ఆదివారం జరిగిన నెల్లూరు జిల్లా ఉదయగిరి సెగ్మెంట్ సమీక్ష సమావేశంలో ప్రత్యర్థి వర్గాలు రెండూ పరస్పరం ఘర్షణకు దిగే పరిస్థితి వచ్చింది. పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారి పేర్లను కొందరు నాయకులు వెల్లడి చేయగా ఇతరులు దానిని ఖండించినప్పుడు ఈ వాతావరణం నెలకొన్నది. రెండు వర్గాలూ కుర్చీలను పట్టుకుని విసరడానికన్నట్లుగా పైకెత్తాయని, కాని ఘర్షణను నివారించారని పార్టీ వర్గాలు తెలియజేశాయి.
చీరాల అసెంబ్లీ సెగ్మెంట్ సమీక్ష సమావేశంలో పార్టీ నాయకులు పరస్పరం వేలెత్తి చూపుకున్నారు. ఇతర సెగ్మెంట్లలో పార్టీ పేలవమైన ప్రదర్శనకు తగినంతగా ఖర్చు చేయకపోవడమే కారణమని పేర్కొన్నారు. 'పార్టీ ఆశించిన స్థాయిలో అభ్యర్థి ఖర్చు చేయలేదని కొందరు నాయకులు ఆరోపించారు' అని నెల్లూరు జిల్లాకు చెందిన పార్టీ నాయకుడు ఒకరు తెలియజేశారు. విజయనగరం కురుపాం సెగ్మెంట్ సమీక్ష సమావేశంలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నాలుగు గంటల పాటు సమీక్ష జరిపిన అనంతరం ఆ స్థానాన్ని దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ)కే ఉన్నాయని అంగీకరించినట్లు టిడిపి సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు.
కడప, అనంతపురం జిల్లా నాయకులను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు ప్రసంగించినప్పుడు పార్టీ కనుక తిరిగి అధికారంలోకి వచ్చినట్లయితే తన పది వేల మంది కేడర్ల ద్వారా ప్రభుత్వ పథకాలన్నిటినీ అమలుపరిచేట్లు చూడగలమని చెప్పారు. ఎన్నికల గురించి చంద్రబాబు ప్రస్తావిస్తూ, 'ఇవి స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగి ఉన్నట్లయితే చివరకు పులివెందుల స్థానాన్ని కూడా టిడిపి కైవసం చేసుకోగలదు' అని చెప్పారు.
News Posted: 12 May, 2009
|