రిసార్ట్ వేటలో పిఆర్పీ
హైదరాబాద్ : రాష్ట్రంలో హంగ్ శాసనసభ ఏర్పడే సూచనలు కనిపిస్తున్న దృష్ట్యా, ప్రభుత్వం ఏర్పాటుకు కావలసిన బలం సంపాదించేందుకు ఇతర పార్టీల ప్రలోభాన్ని తప్పించుకోవడానికి తన పార్టీ ఎంఎల్ఎల కోసం ఈ నెల 16 నుంచి ఒక శిబిరాన్ని నిర్వహించాలని ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ) యోచిస్తున్నది. ఈ శిబిరాన్ని నాలుగు రోజుల పాటు, లేదా తదుపరి ప్రభుత్వం ఏర్పడేంత వరకు నిర్వహించవచ్చు. పార్టీ అధ్యక్షుడు చిరంజీవి, ప్రధాన కార్యదర్శి, ఆయన బావమరిది అల్లు అరవింద్ ఈ శిబిరం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
వారి ఆదేశాన్ని పురస్కరించుకుని పార్టీ నాయకులు కొందరు హైదరాబాద్ నగర శివార్లలోని మూడు రిసార్టులను, రెండు హోటళ్ళను పరిశీలించారు. వాటిలో ఒకదానిని ఈ శిబిరం కోసం ఎంచుకోవచ్చు. చిరంజీవి, అరవింద్ కూడా శిబిరంలోనే బస చేసి అక్కడి నుంచే తమ కార్యకలాపాలు నిర్వహిస్తారు. కొత్తగా ఎన్నికయ్యే ఎంఎల్ఎలను 16 సాయంత్రం హైదరాబాద్ లో బస చేయవలసిందిగా కోరనున్నారు. అదే రాత్రి పిఆర్పీ శాసనసభా విభాగం చిరంజీవిని పార్టీ నాయకుడుగా ఎన్నుకుంటుంది. ఆ ఎన్నిక అనంతరం ఎంఎల్ఎలను శిబిరానికి తరలిస్తారు. ఎంఎల్ఎలను ఒంటరిగా ఉంచుతారు. చిరంజీవి అధికారం ఇచ్చినవారు మినహా వారిని మరెవరూ కలుసుకోనివ్వరు. కమ్యూనికేషన్లు మినహా అన్ని సౌకర్యాలనూ వారికి శిబిరంలో కల్పిస్తారు. పార్టీ తరఫున ఎన్నికయ్యే ఎంపిలను కూడా ఒక రోజు తరువాత అంటే 17న శిబిరానికి తీసుకువస్తారు.
పార్టీకి మెజారిటీ వచ్చినప్పటికీ కొత్తగా ఎన్నికయ్యే ఎంఎల్ఎలను శిబిరానికే పరిమితం చేయాలని పార్టీ నాయకులు నిశ్చయించారు. వారిని శిబిరం నుంచి నేరుగా గవర్నర్ వద్దకు తీసుకువెళ్ళి, పార్టీ బలాన్ని నిరూపించి, ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం కల్పించవలసిందని కోరేందుకు ఆయన ముందు నిలబట్టగలరు. ముఖ్యమంత్రిగా ఎన్నికైన నాయకుడు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత పార్టీ ఎంఎల్ఎలకు ఈ నిర్బంధం నుంచి విముక్తి కలిగిస్తారు. అయితే, ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాని పక్షంలో పార్టీ భవిష్య కార్యాచరణను నిర్ణయించుకుని తదనుగుణంగా వ్యవహరించవలసిందని ఆదేశించేంత వరకు ఎంఎల్ఎలను శిబిరంలోనే ఉంచుతారు.
ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రానట్లయితే, ఇతర పార్టీల నుంచి గరిష్ఠ స్థాయిలో లబ్ధి పొందాలని పార్టీ ఆకాంక్షిస్తున్నది. పార్టీ వాటి మద్దతు తీసుకుని చిరంజీవిని ముఖ్యమంత్రిని చేస్తుంది. చిరంజీవిని ముఖ్యమంత్రిని చేయడానికి ఇతర పార్టీలు అంగీకరించని పక్షంలో వాటికి మద్దతు ఇవ్వరాదని పార్టీ నాయకులు అనుకుంటున్నారు. అటువంటి పరిస్థితిలో ప్రతిపక్షంలోనే కూర్చోవాలని వారు నిర్ణయించారు. కాగా, జాతీయ స్థాయిలో ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వవలసి వస్తే, అన్ని మార్గాలను పరిశీలించిన తరువాతే పిఆర్పీ నిర్ణయం తీసుకుంటుంది. భావసారూప్యం గల ఇతర పార్టీలు సంఘటితమైనట్లయితే నాలుగవ ఫ్రంట్ ఏర్పాటుకు పార్టీ ప్రయత్నిస్తుందని పార్టీ నాయకుడు ఒకరు తెలియజేశారు.
News Posted: 14 May, 2009
|