ఇక దేవుని కరుణే కావాలి
హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ శనివారం జరగనుండగా రాజకీయ నాయకులు, వారి అనుచరులు భగవంతుని కరుణా కటాక్షాల కోసం ప్రార్థనలు ప్రారంభించారు. తెలుగు దేశం పార్టీ (టిడిపి) పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు రోజా ఈమధ్య పార్టీ యువజన విభాగం నాయకులతో కలసి హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో గణపతి యాగం నిర్వహించారు. 'చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలి. ప్రజలు కోరుకుంటున్నది ఇదే' అని ఆమె చెప్పారు. 'ఈ ఆకాంక్ష నెరవేరడం కోసం మేము ఈ యాగం నిర్వహించాం' అని రోజా తెలిపారు.
ప్రముఖ తెలుగు నటులు మహేష్, ఆయన తండ్రి కృష్ణ అభిమానుల సంఘం కృష్ణ - మహేష్ సేన కూడా కాంగ్రెస్ విజయాన్ని ఆకాంక్షిస్తూ సుదర్శన యాగం నిర్వహించింది. కృష్ణ భార్య, సినీ నటి, దర్శకురాలు విజయనిర్మల ఈ యాగం సందర్భంగా ప్రార్థనలు జరిపారు. 'ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి సామాన్య ప్రజానీకం కోసం పలు కార్యక్రమాలను అమలు జరిపారు' అని విజయనిర్మల చెప్పారు. 'డాక్టర్ రాజశేఖరరెడ్డి రెండవ దఫా ముఖ్యమంత్రి అయ్యేందుకు భగవంతుని ఆశీస్సులు కోరేందుకై నేను ఈ యాగంలో పాల్గొన్నాను' అని ఆమె తెలిపారు. అయితే, ఆమె కుమారుడు, సినీ నటుడు నరేష్ భారతీయ జనతా పార్టీ (బిజెపి) తరఫున అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ స్థానానికి పోటీ చేయడం గమనార్హం. ఆయన విజయాన్ని కాంక్షిస్తూ కూడా విజయనిర్మల ప్రార్థనలు జరిపి ఉంటారు.
ఈ విషయంలో తామేమీ తీసిపోలేదంటూ ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ) అధ్యక్షుడు చిరంజీవి అభిమానులు 148 మంది తమ 'హీరో' ముఖ్యమంత్రి కావడానికి దైవానుగ్రహం కోరుతూ గురువారం రక్త దాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అల్లు అరవింద్, ఆయన కుమారుడు అల్లు అర్జున్, చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మరి ఆ భగవంతుడు ఎవరి ప్రార్థనలు ఆలకించి ఉంటాడో శుక్రవారం తేలనున్నది.
News Posted: 15 May, 2009
|