బాబు కోసం బిజెపి ప్రయాస
హైదరాబాద్ : ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ)కు స్వల్ప ఆధిక్యం లభించవచ్చునని ఎగ్జిట్ పోల్స్ సూచించడంతో తెలుగు దేశం పార్టీ (టిడిపి)ని తన వైపు తిప్పుకునే ప్రయత్నాలను భారతీయ జనతా పార్టీ (బిజెపి) ముమ్మరం చేసింది. తెలుగు దేశం పార్టీ కనుక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పక్షంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్ డిఎ) ప్రభుత్వంలో చేరవలసిందిగా టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును బిజెపి ఆహ్వానించే అవకాశం ఉన్నది.
టిడిపి మద్దతు లభించినట్లయితే జాతీయ స్థాయిలో ఎన్ డిఎ అనుకూలంగా పరిస్థితులు మారిపోగలవని బిజెపి నాయకులు విశ్వసిస్తున్నారు. టిడిపి 20 లోక్ సభ సీట్లను గెలుచుకోగలదని బిజెపి నాయకులు ఊహిస్తున్నారు. టిడిపికి 15 లోక్ సభ స్థానాలే లభించినా కూడా ఆ పార్టీ కీలక పాత్ర పోషించగలదని వారు భావిస్తున్నారు. టిడిపిని తమ వైపు తిప్పే బాధ్యతను ఎం. వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయలతో సహా బిజెపి సీనియర్ నాయకులకు అప్పగించారు. ఎల్.కె. అద్వానీ, రాజ్ నాథ్ సింగ్ లతో సహా పార్టీ అగ్ర శ్రేణి నాయకులతో వ్యూహాల గురించి వారు చర్చిస్తున్నారు.
'వామపక్షాలు, కాంగ్రెస్ మినహా మరే పార్టీ మద్దతునైనా స్వీకరించడానికి బిజెపి సుముఖమే' అని బిజెపి అధికార ప్రతినిధి ఎన్. రామచంద్రరావు తెలియజేశారు. 'చంద్రబాబు నాయుడు మద్దతు స్వీకరించడానికి మాకేమీ అభ్యంతరం లేదు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా కాంగ్రెస్ ను అడ్డుకోవాలని టిడిపి పట్టుదలగా ఉన్నది' అని ఆయన తెలిపారు. టిడిపి కనుక బిజెపితో చేతులు కలిపినట్లయితే, ఆ పార్టీకి తగినంత గౌరవం ఇవ్వగలమని ఆయన తెలిపారు. 'టిడిపి నాయకులు మమ్మల్ని నమ్మి బిజెపికి మద్దతు అందజేయవచ్చు. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడంలో బిజెపికి ఎంతో అనుభవం ఉంది కదా' అని రామచంద్రరావు పేర్కొన్నారు.
తృతీయ ఫ్రంట్ కు ప్రభుత్వ స్థాపనకు కావలసినన్ని సీట్లు రాకపోవచ్చునని బిజెపి నాయకులు అభిప్రాయపడుతున్నారు. టిడిపి కనుక మద్దతు అందజేస్తే ఎన్ డిఎతో చేతులు కలిపేందుకు ఇతర పార్టీలకు ప్రోత్సాహకరం కాగలదని బిజెపి నాయకులు అంటున్నారు.
ఇది ఇలా ఉండగా, టిడిపి వెలువరించిన 'ఎగ్జిట్ పోల్స్' ఫలితాల ప్రకారం, మహా కూటమి భారీ విజయం సాధించగలదు. మహా కూటమికి 179 సీట్లు, కాంగ్రెస్ కు 57, ప్రజారాజ్యం పార్టీకి 21, ఎంఐఎంకు 4, బిజెపికి 3, ఇతరులకు 5 సీట్లు వస్తాయని పార్టీ సూచిస్తున్నది. బుధవారం సాక్షి దినపత్రిక ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల మాదిరిగానే 25 స్థానాలలో 'పోటీ తీవ్రాతితీవ్రంగా' ఉండగలదని టిడిపి సూచిస్తున్నది.
News Posted: 15 May, 2009
|