తెరాసలో మహోత్సాహం
హైదరాబాద్ : జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్ డిఎ) కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు మిక్కుటంగా ఉన్నాయని సూచిస్తున్న సర్వే నివేదికలు తెలంగాణ రాష్ట్ర సమితిలో మహోత్సాహాన్ని నింపినట్లు కనిపిస్తున్నది. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు హైదరాబాద్ లో పార్టీ నాయకులతో మాట్లాడారని, ఎన్నికల అనంతర పరిస్థితి కీలక దశకు చేరుకున్న దృష్ట్యా అభ్యర్థులందరూ తెలంగాణ భవన్ కు చేరుకునేట్లు చూడాలని వారిని కోరారని పార్టీ వర్గాలు తెలియజేశాయి.
కేంద్రంలోను, రాష్ట్రంలోను ప్రభుత్వాల ఏర్పాటులో తెరాస కీలక పాత్ర పోషించగలదని, అందువల్ల పార్టీ అభ్యర్థులనందరూ ఒక చోట కలసి ఉండేట్లు చూడడం అవసరమని కెసిఆర్ సూచించారు. కేంద్రంలో ఎన్ డిఎ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలన్న తెరాస నిర్ణయం పట్ల తమ తమ నియోజకవర్గాలలో జనాభిప్రాయం ఎలా ఉందో అభ్యర్థుల నుంచి తెలుసుకోవలసిందిగా కూడా పార్టీ నాయకులను పార్టీ అధినేత కోరారు. దీనితో సీనియర్ నాయకుడు జి. విజయరామారావు, నాయని నరసింహారెడ్డి, పార్టీ సభా నాయకుడు ఇ. రాజేందర్ అభ్యర్థులతో మాట్లాడారు. ఈ విషయమై జనం స్పందన సానుకూలంగా, ప్రోత్సాహకరంగా ఉందని వారు ఆతరువాత మీడియాతో చెప్పారు.
ఎగ్జిట్ పోల్స్ పై వ్యాఖ్యానించవలసిందని కోరినప్పుడు 'మా పార్టీకి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై విశ్వాసం లేదు. మీడియా సంస్థలు ప్రకటించే ఫలితాలు తుదివి కావు. 25 నుంచి 30 వరకు అసెంబ్లీ సీట్లను, ఆరు లోక్ సభ సీట్లను గెలుచుకోగలమని, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్ డిఎ మరిన్ని పార్టీల మద్దతును సంపాదించగలదని తెరాస దృఢనమ్మకంతో ఉన్నది' అని రాజేందర్ చెప్పారు.
రాష్ట్రంలో మహా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని, కాంగ్రెస్, ఇతర పార్టీలు నిరాశకు గురి కాక తప్పదని తెరాస నాయకులు అన్నారు. సర్వే నివేదికలు వాటికి తాత్కాలికంగా ఆనందాన్ని కలిగించి ఉండవచ్చునని, కాని వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని వారు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని సంతుష్టి పరచడానికే ఆ సర్వే నివేదికలను రూపొందించారని వారు అన్నారు.
News Posted: 15 May, 2009
|