ఢిల్లీలో బాబుకు పాత్ర లేదు
హైదరాబాద్ : తెలుగు దేశం పార్టీ (టిడిపి) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయ రంగంలో ఒక విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చేతిలో కొద్దిపాటి లోక్ సభ స్థానాలే ఉండడంతో తృతీయ ఫ్రంట్ కోసం ఆయన చేసేదేమీ లేదు. వాస్తవానికి ఢిల్లీలో ఆ ఫ్రంట్ పరిస్థితే అగమ్యగోచరంగా తయారైంది. కాంగ్రెస్ సారథ్యంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) ఎన్నికలలో గణనీయంగా సీట్లు గెలుచుకోవడంతోను, దాని సమీప ప్రత్యర్థి జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్ డిఎ) బాగా వెనుకబడి ఉండడంతోను రాత్రికి రాత్రే మారిపోయిన రాజకీయ సినేరియోలో చంద్రబాబు నాయుడుకు నిర్వర్తించేందుకు పాత్ర ఏమీ లేకపోయింది.
శుక్రవారం వరకు కూడా చంద్రబాబు నాయుడు తృతీయ ఫ్రంట్ ను దృఢమైనదిగా తీర్చిదిద్దడంలో తీరిక లేకుండా గడిపారు. ఆయన చొరవ తీసుకుని జయలలిత, మాయావతి, ప్రకాశ్ కరత్ ప్రభృతులతో ఫోన్ లో మాట్లాడారు. తృతీయ ఫ్రంట్ ప్రభుత్వం కల వాస్తవ రూపం దాల్చడానికి మద్దతు ఇవ్వవలసిందిగా జయలలితకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్ డిఎకు మద్దతు ఇవ్వవలసిందిగా భారతీయ జనతా పార్టీ (బిజెపి) నుంచి ఆహ్వానం రూపంలో వచ్చిన తాయిలాన్ని కూడా చంద్రబాబు తోసిపుచ్చారు. తాను తృతీయ ఫ్రంట్ తోనే ఉంటానని, దానిలోనే కొనసాగుతానని ఆయన ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఆ పార్టీకి రెండంటే రెండు లోక్ సభ సీట్లు లభించాయి. ఒక సీటును పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు, రెండవ సీటును పార్టీ ప్రధాన కార్యదర్శి, సినీ నటి విజయ శాంతి గెలుచుకున్నారు. రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత కెసిఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలన్న తన కలను వాస్తవం చేయగల పార్టీల అన్వేషణ సాగిస్తూ ఢిల్లీలోనే ఎక్కువ కాలం గడిపారు. సంకీర్ణ ధర్మాన్ని కూడా విస్మరించి ఆయన ఎన్ డిఎలో చేరారు. బిజెపి సారథ్యంలోని ఎన్ డిఎను వ్యతిరేకించే రాష్ట్రంలోని మహాకూటమిలో టిఆర్ఎస్ భాగస్వామ్య పక్షం కదా!
ఇక మహాకూటమి కేంద్రంలో తృతీయ ఫ్రంట్ కు దాదాపుగా అద్దంలో ప్రతిబింబం వంటిది. ఎన్ డిఎకు మద్దతు ఇవ్వాలన్న తన నిర్ణయాన్ని చంద్రశేఖరరావు సమర్థించుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటును సాధ్యం చేయగల ఏకైక రాజకీయ సంకీర్ణం అదేనని ఆయన వాదించారు. చంద్రబాబు నాయుడును ఒప్పించి తిరిగి ఎన్ డిఎలోకి తీసుకురాగలనని కూడా ఆయన హామీ ఇచ్చారు. టిడిపికి మద్దతు ఉపసంహరిస్తామనే బెదరింపుతో చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి తీసుకురాగలనని ఆయన బిజెపి నాయకులతో చెప్పారు.
చంద్రశేఖరరావు మూడు రోజుల క్రితం హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. ఇప్పుడు ఆయనకు గాని, చంద్రబాబు నాయుడుకు గాని కేంద్రంలో ఎన్ డిఎ బలంలో నాటకీయ మార్పు తీసుకురావడానికి లోక్ సభ సీట్ల పరంగా తగినంత బలం లేదు. ఆ నాయకులిద్దరూ ఈ ఎన్నికల ఫలితాలకు ఇప్పుడు కుంగిపోయారు. చంద్రశేఖరరావు తన పార్టీ కార్యాలయంలోనే ఉండిపోగా చంద్రబాబు నాయుడు తన నివాసానికే పరిమితమై పోయారు. ఆయన ఎవరినీ కలుసుకోలేదు.
News Posted: 17 May, 2009
|