కొరగాని సినీ గ్లామర్
హైదరాబాద్ : రాష్ట్రంలో శనివారం వెలువడిన లోక్ సభ, శాసనసభ ఎన్నికల ఫలితాలు ఈ సారి సినీ గ్లామర్ ప్రభావం ఏమాత్రం లేదని తేల్చాయి. నటీమణులు జయసుధ, విజయశాంతి మినహా తెలుగు చలనచిత్ర పరిశ్రమ (టాలీవుడ్) నుంచి ఎన్నికలలో పోటీ చేసిన ఇతర ప్రముఖులు పరాజితులయ్యారు. నటులు రోజా, మురళీమోహన్, కృష్ణంరాజు, నరేష్, బాబూ మోహన్, పోసాని కృష్ణ మురళి, నిర్మాతలు అల్లు అరవింద్, చెంగల వెంకటరావు, మాగంటి బాబు ఓటమిని చవి చూశారు.
తిరుపతి, పాలకొల్లు నుంచి పోటీ చేసిన మెగాస్టార్, ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ) అధ్యక్షుడు చిరంజీవి పాలకొల్లులో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో పరాజయం పొందారు. జూనియర్ ఎన్టీఆర్ కు సన్నిహిత సహచరుడైన సినీ నిర్మాత వల్లభనేని వంశీ మోహన్ కూడా విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఓడిపోయారు. ప్రముఖ నటులు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ సాగించిన ప్రచారం తెలుగు దేశం, ప్రజారాజ్యం పార్టీలకు ఏమాత్రం సత్ఫలితాలను సాధించలేకపోయింది.
'ఓటర్లు ఇప్పుడు మరింత విజ్ఞతతో వ్యవహరిస్తున్నారు. గ్లామర్ జనాన్ని రప్పించి వారి దృష్టిని ఆకర్షిస్తుంది. నటులు చెప్పేదేమిటో అని జనం తప్పకుండా వింటారు. కాని ఓటింగ్ దగ్గరకు వచ్చేసరికి వారు ఆచి తూచి వ్యవహరిస్తారు. తాను కోరుకున్న అభ్యర్థికి లేదా పార్టీకి వారు ఓటు వేస్తారు. గ్లామర్ వల్ల ఓట్లు రాలతాయని భావించడం తప్పు. ఈ ఫలితాలు అదే విషయాన్ని తేల్చాయి' అని నటి, కాంగ్రెస్ నాయకురాలు జీవిత రాజశేఖర్ వ్యాఖ్యానించారు.
పరాజయానికి కారణాలు ఎన్నో ఉన్నాయని నటులు అంటున్నారు. తమ 'స్టార్ డమ్' కారణంగా సీట్లు గెలుచుకోగలిగిన నటులు తమను 'స్టార్లు'గా చూడరాదని కోరుతున్నారు. 'ఓట్ల విషయానికి వచ్చేసరికి నటులు కూడా ఇతర రాజకీయ నాయకుల వంటివారే. గ్లామర్ వల్ల వారు అందరికీ తెలుస్తారు. ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి. ఓట్లను రాబట్టేందుకు గ్లామర్ ఎన్నడూ దోహదం చేయదు' అని నటుడు నరేష్ అన్నారు. నరేష్ భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థిగా అనంతపురం జిల్లా హిందూపురంలో పోటీ చేసి ఓడిపోయారు.
News Posted: 17 May, 2009
|