పునర్విభజనతో చేటు
హైదరాబాద్ : నియోజకవర్గాల రూపురేఖలను మార్చివేసిన పునర్విభజన ప్రక్రియ ఈ ఎన్నికలలో పలువురు రాష్ట్ర మంత్రులకు నష్టదాయకంగా పరిణమించింది. వారిలో చాలా మంది తమకు అచ్చివచ్చిన, ప్రీతిపాత్రమైన నియోజకవర్గాలను వదులుకుని కొత్త నియోజకవర్గాలకు మారవలసి వచ్చింది. వారు ఆ కొత్త నియోజకవర్గాలలో ఓటర్లకు అభిమానపాత్రులు కాలేకపోయారు.
రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సంభాని చంద్రశేఖర్ తన పాలేరు నియోజకవర్గాన్ని వదలి సత్తుపల్లికి మారవలసి వచ్చింది. ఆయన కొత్త నియోజకవర్గానికి అలవాటు పడలేకపోయారు. తెలుగు దేశం పార్టీ (టిడిపి) అభ్యర్థి ఎస్. వెంకట వీరయ్య చేతిలో సంభాని ఓడిపోయారు. జువ్వాడి రత్నాకరరావుకు కూడా ఇటువంటి అనుభవమే ఎదురైంది. కరీంనగర్ జిల్లాలోని తన పాత నియోజకవర్గం బుగ్గారం అదృశ్యం కాగా ఆయన కోరుట్ల సెగ్మెంట్ కు మారారు. తెలంగాణలో మెట్ పల్లి, బుగ్గారం నియోజకవర్గాలు రద్దు కాగా వాటి బదులు ధర్మపురి, కోరుట్ల సెగ్మెంట్లు ఏర్పడ్డాయి.
కృష్ణా జిల్లాలో తన ముదినేపల్లి నియోజకవర్గం పునర్విభజనలో అదృశ్యం కాగా గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు గుడివాడకు మారారు. అయితే, గుడివాడలో ఆయన టిడిపి సిట్టింగ్ సభ్యుడు కె. వెంకటేశ్వరరావు చేతిలో పరాజయం పొందారు.
ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ) నాయకుడు టి. దేవేందర్ గౌడ్ రంగారెడ్డి జిల్లాలో మేడ్చల్ నుంచి ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి మారారు. కాని ఆయన ఓడిపోయారు. ఆయన మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గంలో కూడా పోటీ చేశారు కాని అక్కడా ఆయనకు ఓటమి తప్పలేదు.
అయితే, కొందరు కొత్త నియోజకవర్గాలలో విజయాలు సాధించారు. రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి కుందూరు జానారెడ్డి తన చలకుర్తి స్థానం నుంచి నాగార్జున సాగర్ కు మారినా గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజనలో చలకుర్తి అదృశ్యమైంది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య జనగామ నుంచి కేవలం 44 ఓట్ల తేడాతో గెలుపొందగా గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గంలో పదవ రౌండ్ లెక్కింపు తరువాతే నెగ్గారు.
News Posted: 17 May, 2009
|