150 మంది క్రిమినల్ ఎంపిలు
న్యూఢిల్లీ : విజయ్ శుక్లా, డి.పి. యాదవ్, ముఖ్తార్ అన్సారి వంటి ఘరానా నేరస్థులు, నేరస్థులుగా నిర్థారితులైన రాజకీయ నాయకులు పలువురి భార్యలు ఈ దఫా ఎన్నికలలో పరాజితులై ఉండవచ్చు. కాని కళంకిత వ్యక్తులు అనేక మంది 15వ లోక్ సభకు ఎన్నిక కాగలిగారు. అభ్యర్థు దాఖలు చేసిన అఫిడవిట్లను విశ్లేషిస్తే క్రిమినల్ కేసులు ఉన్న ఎంపిల సంఖ్య 2004లో ఎన్నికైన వారితో పోలిస్తే 22 శాతం పెరిగినట్లు విదితమైంది. కొత్తగా ఎన్నికైన 150 మంది ఎంపిలపై క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వారిలో భారతీయ శిక్షా స్మృతి (ఐపిసి) కింద పెండింగ్ లో ఉన్న, తీవ్రమైన అభియోగాలకు గురైన వారు 73 మంది ఉన్నారు.
ఈ విశ్లేషణ జరిపిన ఎన్నికల నిఘా బృందం 'నేషనల్ ఎలక్షన్ వాచ్' నివేదిక ప్రకారం, భారతీయ జనతా పార్టీ (బిజెపి) తరఫున ఎన్నికైన, క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నవారు గరిష్ఠ సంఖ్యలో ఉన్నారు. ఇటువంటి బిజెపి ఎంపిలు 42 మంది ఉన్నారు. కాషాయ పార్టీ తరువాతి స్థానంలో కాంగ్రెస్ ఉన్నది. క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్న కాంగ్రెస్ ఎంపిల సంఖ్య 41. సమాజ్ వాది పార్టీ (ఎస్ పి) నుంచి 8 మంది, బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్ పి) నుంచి ఆరుగురు ఎంపిలు ఉన్నారు.
ఎన్నికలలో ఓడిపోయిన క్రిమినల్ కేసులు ఉన్నపేరొందిన వ్యక్తుల జాబితాలో అగ్ర స్థానంలో అతీక్ అహ్మద్ (అప్నా దళ్, యుపి), విజయ్ శుక్లా (జెడి యు, బీహార్), మిత్ర సేన్ (ఎస్ పి, యుపి), అఖిలేష్ సింగ్ (ఇండిపెండెంట్, నవాడా, బీహార్), దినేష్ రాథోడ్ (ఇండిపెండెంట్, అరారియా, బీహార్) ఉన్నారు.
క్రిమినల్ కేసులతో కొత్తగా ఎన్నికైన ఎంపిలు గరిష్ఠ సంఖ్యలో 31 మంది ఉత్తర ప్రదేశ్ లోనే ఉన్నారు. మహారాష్ట్ర 23 మందితో రెండవ స్థానంలో ఉన్నది. ఆంధ్ర ప్రదేశ్ లో 11 మంది, గుజరాత్ లో 11 మంది, కర్నాటకలో 9 మంది, పశ్చిమ బెంగాల్ లో ఏడుగురు, తమిళనాడులో ఏడుగురు ఇటువంటి ఎంపిలు ఎన్నికయ్యారు.
ఐఐఎం మాజీ ప్రొఫెసర్లు, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ జె.ఎం. లింగ్డో సభ్యులుగా ఉన్న నేషనల్ ఎలక్షన్ వాచ్ 2009 ఎన్నికలకు సంబంధించి ఇతర వివరాలు తెలియజేస్తూ, ఎన్నికలలో 369 పార్టీలు పోటీ చేయగా 36 పార్టీలు మాత్రమే కనీసం ఒకరినైనా లోక్ సభకు పంపగలిగాయి. వాటిలో 19 పార్టీలకు ముగ్గురు, అంతకులోపు సంఖ్యలో ఎంపిలు ఉన్నారు.
News Posted: 18 May, 2009
|