ఆర్థిక మంత్రి మాంటెక్?
న్యూఢిల్లీ : కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి తొలి దఫా సంప్రదింపుల కోసం కాంగ్రెస్ అగ్రశ్రేణి రాజకీయ నాయకుల కోర్ కమిటీ ఆదివారం సమావేశమైంది కాని కొత్త ఆర్థిక మంత్రిపై సస్పెన్స్ మాత్రం వీడలేదు. ఇది సున్నిత సమస్య అయిన కారణంగా ఈ సమాశంలో దీనిపై చర్చకు ఉపక్రమించలేదని కాంగ్రెస్ ఉన్నత స్థాయి ప్రతినిధి ఒకరు తెలిపారు.
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియాను గాని, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ డాక్టర్ సి. రంగరాజన్ ను గాని ఆర్థిక మంత్రి పదవిలో నియమించాలనేది ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ వ్యక్తిగత అభిప్రాయం. ప్రధానికి వారిద్దరితోను వ్యక్తిగతంగా సత్సంబంధాలు ఉన్నాయి. అదే సమయంలో కొత్త ప్రభుత్వంలో ఈ శాఖలో ప్రణబ్ ముఖర్జీని కొనసాగించి, విదేశాంగ శాఖను తప్పించాలనే ప్రతిపాదన కూడా ఉన్నది. ప్రణబ్ ముఖర్జీ సీనియారిటీని, పార్టీలో సమస్యలు పరిష్కరించగల సమర్థుడుగా ఆయనకు గల ప్రాముఖ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది.
రాజీవ్ గాంధి వర్ధంతి మరునాడు ఈ నెల 22న కొత్త మంత్రి మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఉంది. దీని వల్ల పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధికి, డాక్టర్ మన్మోహన్ సింగ్ కు ఈ సమస్యను పరిష్కరించేందుకు తగినంత వ్యవధి లభిస్తుంది. కొత్త మంత్రి మండలిలో అనుభవజ్ఞులు, సరికొత్త సభ్యుల మధ్య సమతూకం పాటించవచ్చు. కొత్త సభ్యులు ఉండడం వల్ల మంత్రి మండలి పిన్న వయస్కులతో కూడుకున్నదిగా కనిపించగలదు. ఆంధ్ర ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్రలలో కాంగ్రెస్ పార్టీకి గణనీయ సంఖ్యలో సీట్లు లభించినందున ఈ రాష్ట్రాల ఎంపిలకే ఎక్కువ మంత్రి పదవులు లభించవచ్చు. మహారాష్ట్రకు చెందిన దళిత నాయకుడు, పాత మంత్రివర్గంలో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న సుశీల్ కుమార్ షిండే కొత్త లోక్ సభకు స్పీకర్ కావచ్చు.
News Posted: 18 May, 2009
|