హతునికి 3500 ఓట్లు
కోరాపుట్ (ఒరిస్సా) : తన నామినేషన్ పత్రాలపై సంతకం చేసిన, ఏప్రిల్ 9న మావోయిస్టుల చేతుల్లో బలైన ఒక వ్యక్తి ఒరిస్సాలో మల్కన్ గిరి (ఎస్ టి) అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాల పట్టికలో నాలుగవ స్థానంలో నిలిచాడు. మావోయిస్టుల ప్రాబల్యం గల ఈ నియోజకవర్గంలో వారి చేతుల్లోనే ప్రాణాలు కోల్పోయిన సమృద్ధ ఒడిస్సా అభ్యర్థి సోమనాథ్ మాదకామికి 3573 ఓట్లు పోలయ్యాయి. ఫలితాల పట్టిక ప్రకారం, జిల్లా పరిషత్ మాజీ సభ్యుడైన మాదకామి పేరు ఏడుగురు అభ్యర్థులలో బిఎస్ పి, ఆర్ఎస్ పి, ఒరిస్సా ముక్తి మోర్చా అభ్యర్థుల కన్నా ముందే చోటు చేసుకుంది.
ఈ నియోజకవర్గంలో ఏప్రిల్ 16న పోలింగ్ జరగడానికి ఏడు రోజుల ముందు సాయుధ మావోయిస్టుల బృందం ఎంపివి 35 గ్రామం సమీపంలోని మాదకామి ఇంటిపై దాడి చేసి ఆయన భార్య భయవిహ్వలయై చూస్తుండగానే ఆయన గొంతు కోశారు. ఎన్నికలకు ముందు ఒరిస్సాలో ఏదైనా పార్టీ అభ్యర్థిని హత్య చేయడం బహుశా అదే మొదటిసారి కావచ్చు. అయితే, ఆయనను నిలబెట్టిన సమృద్ధ ఒడిస్సా ఎన్నికల కమిషన్ (ఇసి) గుర్తింపును ఇంకా పొందనందున నియోజకవర్గంలో ఎన్నికలను వాయిదా వేయలేదు.
'(1968 నాటి ఎన్నికల గుర్తుల (రిజర్వేషన్, కేటాయింపు) ఉత్తర్వు కింద ఎన్నికల కమిషన్) గుర్తింపు ఉన్న రాజకీయ పార్టీ అభ్యర్థి మృతి చెందిన సందర్భంలో మాత్రమే ఎన్నికలను వాయిదా వేయవచ్చునని 1951 నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టం సూచిస్తున్నది' అని ఎన్నికల అధికారి ఒకరు తెలియజేశారు.
News Posted: 18 May, 2009
|