44 ఫోటో - ఫినిష్ లు
హైదరాబాద్ : ఎన్నికలు అభ్యర్థులను అత్యంత ఉత్కంఠకు గురి చేస్తుంటాయి. అభ్యర్థులు ఊపిరి బిగపట్టి మరీ ఫలితాల కోసం రోజుల తరబడి ఎదురుచూస్తుంటారు. మెజారిటీ బాగా అధికంగా ఉంటే వారు హమ్మయ్య అని అనుకుంటారు. అదే పరిస్థితి కాస్త ఎదురుతిరిగి మార్జిన్ నామమాత్రంగా ఉంటే ఫలితం ప్రకటించేంత వరకు వారు ఎటూ పాలుపోని స్థితిలో ఉంటారు.
రాష్ట్రంలో రెండు వేల ఓట్ల లోపు మార్జిన్ తో అభ్యర్థులు గెలిచి 44 నియోజకవర్గాలలో ఫలితాలను పరిశీలిస్తే ఎన్నికలు అభ్యర్థుల భవితవ్యంతో ఎలా చెడుగుడు ఆడతాయో గ్రహించవచ్చు. అసెంబ్లీ ఎన్నికలలో దాదాపు 44 నియోజకవర్గాలలో అభ్యర్థులు 2000 లోపు ఓట్ల తేడాతో గెలిచారు. కాంగ్రెస్ అలా స్వల్ప తేడాతో 25 స్థానాలలో గెలుపొందగా తెలుగు దేశం పార్టీ (టిడిపి) 13 చోట్ల, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) రెండు చోట్ల, ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ) నాలుగు చోట్ల నెగ్గాయి. కాంగ్రెస్ పార్టీ జనగామ నియోజకవర్గంలో 296 ఓట్ల ఆధిక్యంతోను, కల్వకుర్తి స్థానాన్ని 597 ఓట్ల ఆధిక్యంతోను, పినపాక స్థానాన్ని 349 ఓట్ల ఆధిక్యంతోను, పెనమలూరు స్థానాన్ని 177 ఓట్ల తేడాతోను గెలుచుకున్నది.
తెలుగు దేశం పార్టీ ఉరవకొండలో 242, ఆదోనిలో 256, ముధోల్ లో 183 ఓట్ల ఆధిక్యంతో మాత్రమే గెలిచింది. ప్రజారాజ్యం పార్టీ నెల్లూరు సిటీ స్థానాన్ని 90 ఓట్లు, విజయవాడ తూర్పు స్థానాన్ని 190 ఓట్ల తేడాతో మాత్రమే గెలుచుకున్నది.
News Posted: 18 May, 2009
|