ఎగ్జిట్ పోల్స్ తప్పాయి
హైదరాబాద్ : ఎగ్జిట్ పోల్స్ జోస్యాలు మళ్ళీ తప్పాయి. విజయవాడ కాంగ్రెస్ ఎంపి లగడపాటి రాజగోపాల్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ మాత్రమే దాదాపుగా నిజమైంది.
'ఎన్ డిటివి' ఎగ్జిట్ పోల్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 29 లోక్ సభ సీట్లు వస్తాయని సూచించగా పార్టీకి 33 సీట్లు లభించాయి. తెలుగు దేశం పార్టీ (టిడిపి)కి, వామపక్షాలకు కలిపి పది సీట్లు వస్తాయని ఆ న్యూస్ చానెల్ జోస్యం చెప్పింది. కాని వాస్తవంలో టిడిపికి ఆరు సీట్లు రాగా, వామపక్షాలకు ఒక్క సీటు కూడా రాలేదు. 'హెడ్ లైన్స్ టుడే' చానెల్ కాంగ్రెస్ కు 22, టిడిపికి 14, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)కు 5 లోక్ సభ సీట్లు వస్తాయని సూచించింది. టిఆర్ఎస్ కు రెండు సీట్లు మాత్రమే వచ్చాయి. అదే విధంగా `స్టార్ - నీల్సన్స్' ఎగ్జిట్ పోల్ కాంగ్రెస్ కు 23, టిడిపికి 10, టిఆర్ఎస్ కు 5, వామపక్షాలకు 2 లోక్ సభ సీట్లు లభిస్తాయని సూచించింది.
ఇక శాసనసభ సీట్లకు సంబంధించి 'సాక్షి టివి' కాంగ్రెస్ కు 181, టిడిపికి 42, టిఆర్ఎస్ కు 17, వామపక్షాలకు 5 సీట్లు వస్తాయని జోస్యం చెప్పింది. కాని వాస్తవంలో కాంగ్రెస్ 156 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. టిడిపి నాయకత్వంలోని మహా కూటమికి 106 సీట్లు లభించాయి. 'మహా టివి' చానెల్ అయితే కాంగ్రెస్ పార్టీకి, మహా కూటమికి దాదాపుగా సరి సమానంగా సీట్లు వచ్చి హంగ్ శాసనసభ ఏర్పడుతుందని జోస్యం చెప్పింది. ఈ చానెల్ ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ)కి 50 నుంచి 56 వరకు సీట్లు వస్తాయని సూచించింది. కాని పిఆర్పీకి 18 సీట్లు మాత్రమే దక్కాయి.
'ఐ - న్యూస్' చానెల్ తెలుగు దేశం పార్టీకి, దాని మిత్ర పక్షాలకు మెజారిటీ సీట్లు వస్తాయని సూచించింది. కాని ఫలితాలు కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా వచ్చాయి. అయితే, లగడపాటి రాజగోపాల్ సొంతంగా నిర్వహించిన సర్వే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 155 అసెంబ్లీ సీట్లు, 33 లోక్ సభ సీట్లు వస్తాయని సూచించింది. చివరకు ఇదే తుది ఫలితాలకు దరిదాపుల్లో ఉన్నదని తేలింది. కాంగ్రెస్ పార్టీకి 156 అసెంబ్లీ సీట్లు, 33 లోక్ సభ సీట్లు లభించాయి.
News Posted: 18 May, 2009
|