వీర నారీ మణులు
హైదరాబాద్ : `చట్ట సభలలో సీట్ల కోసం భర్తలతోనే పోటీ చేసి ఢిల్లీ సభలో పీఠం వేసి' అని మహాకవి ఏనాడో సినిమాగీతాన్ని రాశారు. మగువల తెగువ మగధీరులకు తక్కువ కాదని 2009 ఎన్నికలు చక్కగా నిరూపించాయి. రాటు తేలిన రాజకీయ నాయకులను గ్లామర్ ప్రపంచాన్ని ఏలేసిన మెగాస్టార్ లను, మహా మహా మంత్రులను మట్టి కరిపించి విజేతలుగా నిలిచింది నారీమణులే కావడం విశేషం. కొమ్ములు తిరిగిన మగవాళ్ల రాజకీయ ప్రస్థానానికి బ్రేకులువేసిన ఘనతను దక్కించుకున్నారు. సినిమా గ్లామర్ తో ముప్పైయేళ్లు జనం గుండెల్లో జీవిత ఖైదీనై పోయానని ఎక్కడి నుంచి పోటీ చేసిన తనకు ఢోకా లేదని అతి విశ్వాసానికి పోయిన ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు మెగాస్టార్ చిరంజీవిని పాలకొల్లులో కాంగ్రెస్ మహిళా అభ్యర్థి ఓడించి సంచలనం సృష్టించారు. రాజకీయాలలో ఓనమాలు కూడా తెలీని బంగారు ఉషారాణి చాలా ధైర్యంగా ఈ స్థానం నుంచి పోటీ చేశారు. ప్రత్యర్థి చిరంజీవని తెలిసినా కాంగ్రెస్ అధిష్టానం తనకిచ్చిన అవకాశాన్ని ఆమె వదులుకోలేదు. విజయలక్ష్మిని అందుకుని ఉషారాణి జెయింట్ కిల్లర్ గా రికార్డు సృష్టించారు.
ఐదేళ్ళ పాటు రాష్ట్ర శాసన సభను నడిపించి, ప్రతిపక్ష పార్టీలకు కొరకరాని కొయ్యగా కనిపించి, అధికార పక్షాన్ని అనేక సార్లు రక్షించిన మేటి స్పీకర్ సురేష్ రెడ్డి కూడా మహిళ చేతిలోనే పరాజయం పాలయ్యారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి పోటీ చేసిన సురేష్ రెడ్డి తెలుగుదేశం అభ్యర్థి అన్నపూర్ణ చేతిలో చిత్తయ్యారు. ఇంతకూ ఆమె సురేష్ రెడ్డికి మేనత్త కావడం విశేషం. ఈసారి కూడా గెలిచి రెండో సారి స్పీకర్ కావాలని ఆశించిన సురేష్ రెడ్డికి భంగపాటు తప్పలేదు. తెలుగుదేశం పార్టీకి మహా ప్రభంజనం వీస్తున్న తరుణంలో సైతం ఎదురొడ్డి పోరాడి విజయం సాధించిన రెడ్యానాయక్ ఒక మహిళ చేతిలో ఓటమి పాలయ్యారు. వరంగల్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం నుండి వరుస విజయాలతో హ్యాట్రిక్ వీరుడిగా దూకుసు పోతున్న రెడ్యానాయక్ దూకుడుకు తెలుగుదేశం అభ్యర్థి సత్యవతి రాథోడ్ ఈ ఎన్నికల్లో అడ్డుకట్ట వేసింది.
తెలంగాణ రాష్ట్ర సమితి ఉపాధ్యక్షుడు నాయని నరసింహారెడ్డిని ముషిరాబాద్ నియోజకవర్గం నుంచి రెండు మార్లు వరుసగా ఓడించి కాంగ్రెస్ అభ్యర్థి మణెమ్మ అంజయ్య తన పట్టును నిలుపుకున్నారు. దేశం పార్టీకి కంచుకోటగా ఉంటూ వరుస విజయాలను సాధిస్తున్న సికింద్రాబాద్ దేశం అభ్యర్థి తలసాని శ్రీనివాస యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సినీనటి జయసుధ చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రజారాజ్యం పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ తెలుగుదేశం పార్టీ సీనియర్ మంత్రి తమ్మినేని సీతారం ను ఆయన సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సత్యవతి చేతిలో పరాజయం పాలయ్యారు. అనంతపురం జిల్లాలో వుంటూ, కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం నుండి పోటీ చేసిన సిపిఐ కేంద్ర కమిటి సభ్యులు, రాష్ట్ర రైతు సంఘం ఆధ్యులు కె.రామకృష్ణను, స్థానికేతర కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నీరజారెడ్డి ఓడించి జిల్లాలో స్థానం లేకుండా చేశారు. కాగా సీనియర్ తెలుగుదేశం పార్టీ నేత తీగల క్రిష్ణారెడ్డి, మహేశ్వరం నుండి కాంగ్రెస్ అభ్యర్థి రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. టిడిపి పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సినీనటి రోజా అసెంబ్లీ సీటుకు బోణీ కొట్టకుండానే బోర్లా పడ్డారు. చంద్రగిరి నుండి ఆమె ప్రత్యర్థిగా పోటీ చేసినగల్లా అరుణ కుమారి చేతిలో రోజా ఓడిపోయారు.
News Posted: 18 May, 2009
|