లాలూ కోసం సోనియా పట్టు
న్యూఢిల్లీ : ఆయన సోనియా గాంధికి అనుంగు మిత్రుడు. కాంగ్రెస్ వాదులు అనేక మంది ఈర్ష్య పడేంతగా ఆమె నివాసానికి రాకపోకలు సాగిస్తున్నారు. బీహార్ లో మూడు సీట్లు ఇస్తున్నా, తీసుకుంటే తీసుకోండ లేకుంటే వదిలేయండి అని ఆయన కాంగ్రెస్ పార్టీకి విస్పష్టంగా చెప్పిన తరువాత సంబంధాలు దెబ్బ తిన్నాయి. బీహార్ లో స్థానాలపై కాంగ్రెస్ వాదనను రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్ జెడి) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ తోసిపుచ్చినా ఇప్పుడు ఆయన అందుకు ఎంతగానో విచారిస్తున్నారు. లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం, లాలూ పార్టీ ఘోరంగా విఫలం కావడం వల్ల ఆయనను పట్టించుకోవద్దని కాంగ్రెస్ వాదులు, ముఖ్యంగా బీహార్ నాయకులు పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.
ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) తొలి సమావేశానికి ఎన్నికల ముందున్న మిత్ర పక్షాలను మాత్రమే ఆహ్వానించాలన్న కాంగ్రెస్ నిర్ణయం ఫలితంగా లాలూ ఆ సమావేశంలో కనిపించరు. తన పూర్వపు మిత్రపక్షాలు ఆనందం పంచుకుంటూ ప్రభుత్వ ఏర్పాటు గురించి చర్చించుకుంటుంటే లాలూ టివిలోనే ఈ కార్యక్రమాన్ని తిలకించవలసి ఉంటుంది.
అయితే, లాలూ అంతగా బాధపడవలసిన అవసరం కలగకపోవచ్చు. ఎందుకంటే పరాజయ భారంతో కుంగిపోతున్న ఆ రాజకీయ నాయకునికి దేశంలోనే అత్యంత శక్తిమంతమైన మనిషి, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధి నుంచి వత్తాసు లభిస్తున్నది. 1999, 2004 ఎన్నికలలో తనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ (బిజెపి) విషపూరిత ప్రచారం సాగించినప్పుడు ఆయన వెన్నుదన్నుగా నిలవడాన్ని సోనియా మరచిపోలేదు. ఇటీవలి కాలంలో రెండు పార్టీల మధ్య సంబంధాలు దెబ్బ తిన్నప్పటికీ ఆయనకు ఏదో విధంగా అవకాశం కల్పించాలని ఆమె అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు కాకపోయినా తరువాతైనా ఆయనకు మంత్రి పదవి ఇస్తే ఆమె సంతుష్టి చెందుతారనే అభిప్రాయంతో బీహార్ కాంగ్రెస్ వాదులు తమ రాష్ట్రానికి తిరిగి వెళ్ళారు.
News Posted: 19 May, 2009
|