భవిత ఇక యువతదే
న్యూఢిల్లీ : వయస్సు మళ్ళిన, ఎముకులు కుళ్ళిన వారికి చరమ గీతం పాడాలని, శక్తులు నిండిన యువకులు రావాలని కాంక్షించేవారికి 2009 ఎన్నికలు అనేక శుభ సూచనలు చేసింది. రాజకీయాలల్లో ఇంక యువతతే భవిత అని స్పష్టం చేస్తూ ఓటర్లు తీర్పునిచ్చారు. ఈసారి ఎంపీలుగా ఎన్నికైన వారిలో 226 మంది 50 లోపు వయసు గలవారే. యువతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్న ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ చేసిన సూచన ప్రజల్లోకి బలంగా వెళ్లిందో లేక ఓటు వేసే వయసును తగ్గించడం వల్ల కొత్తగా ఓటు హక్కును సంపాదించిన 10 కోట్ల మంది యువత ఆలోచనా ప్రభావమోగానీ ఓటర్లు ముదసలి నేతలను పక్కకునెట్టారు. 15వ లోక్ సభలో అత్యంత పిన్న వయస్కుడిగా కాంగ్రెస్ కు చెందిన మహమ్మద్ సయ్యద్ రికార్డు సృష్టించారు. పార్లమెంటుకు పోటీ చేసే అర్హతను గత సంవత్సరమే పొందిన ఈ 26 ఏళ్ల యువకుడు మారనున్న చరిత్రకు తార్కాణంగా నిలుస్తున్నారు.
బిజెపి సీనియర్ నేత, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ కాంగ్రెస్ ను ఉద్దేశించి ప్రసంగిస్తూ `బుదియా' (ముదుసలి మహిళ)గా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే, ఆ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి ఎల్ కే అద్వానీ వయసు 81 సంవత్సరాలు కావడం గమనార్హం. అయితే, బిజెపి నుంచి లోక్ సభకు ఎన్నికైన వారిలో 77 మంది 50 సంవత్సరాలలోపు వయసు వున్నవారే. లోక్ సభలో ఈసారి 116 సీట్లు గెల్చుకున్న బిజెపి వరుసగా రెండోసారి ఎక్కువ సంఖ్యలో 50 లోపు వయసుగల సభ్యులను అందిస్తున్నది. అయితే, వయసు మీరిన వారిని తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. ముఖ్యంగా రాజకీయాల్లో వయసు కంటే అనుభవం ప్రధానమని జెడి అభ్యర్థిగా ఎన్నికైన 88 సంవత్సరాల రాంసుందర్ దాస్ నిరూపించారు.
కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (ఎల్ జెపి) అధ్యక్షుడు రాం విలాస్ పాశ్వాన్ ను చిత్తుచేసి రాంసుందర్ దాస్ చరిత్ర సృష్టించారు. ఒకప్పుడు 4.24 లక్షల ఓట్ల తేడాతో విజయభేరి మోగించి రికార్డు నెలకొల్పిన పాశ్వాన్ ఒక వృద్ధనేత చేతిలో పరాజయం పాలు కావడం రాజకీయాలకు వయసుతో నిమిత్తం లేదనే విషయాన్ని స్పష్టం చేసిందనే వాదన కూడా వుంది. కాగా, 50 సంవత్సరాలలోపు వయసు గల 226 మంది ఎంపీల్లో 82 మంది వయసు 40 శాతం లేదా అంతకు తక్కువ కావడం విశేషం. షష్టిపూర్తి చేసుకున్న ఎంపీల సంఖ్య 147. ఇలా వుండగా, 76 ఏళ్ల మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఏర్పడనున్న కేబినెట్ లో ఈ సారి యువకులకు అధిక ప్రాధాన్యం లభించవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతేగాక, యువతను ఆకట్టుకొని, యుపిఏ విజయంలో కీలకపాత్ర పోషించిన రాహుల్ గాంధీకి ఈ సారి మంత్రి పదవి దక్కుతుందని తెలుస్తోంది. అదే జరిగితే, భవిష్యత్తులో యువనేతలే దేశ రాజకీయాల్లో కీలకపాత్రను పోషిస్తారనడంలో సందేహం లేదు.
News Posted: 19 May, 2009
|