పోస్టల్ వోట్లతో కాంగ్రెస్ లబ్ధి
హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కనీసం 40 స్థానాలలో కాంగ్రెస్ విజయానికి పోస్టల్ బ్యాలట్లు దోహదం చేశాయి. ఉద్యోగులలో అత్యధిక సంఖ్యాకులు అధికార పార్టీకి అనుకూలంగా ఓటు వేశారు. మూడు లక్షల పోస్టల్ బ్యాలట్లు ఎన్నికల ఫలితాలను కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చాయి.
కేవలం 2147 ఓట్ల ఆధిక్యంతో రాజమండ్రి కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి ఉండవల్లి అరుణ కుమార్ కు పోస్టల్ బ్యాలట్ల రూపంలో 1542 ఓట్లు వచ్చాయి. విశాఖపట్నంలో 341 ఓట్ల తేడాతో మాత్రమే నెగ్గిన కాంగ్రెస్ అభ్యర్థి ద్రోణంరాజు శ్రీనివాస్ కు వచ్చిన పోస్టల్ బ్యాలట్లు 188. పాయకరావుపేటలో అధికార పార్టీ అభ్యర్థి బాబూ రావు కేవలం 656 ఓట్ల తేడాతో గెలిచారు. ఆయనకు 374 పోస్టల్ బ్యాలట్లు పోలయ్యాయి.
కాంగ్రెస్ అభ్యర్థులు అలంపూర్ (మెజారిటీ 1194), కొల్లాపూర్ (1194), పినపాక (349), పాడేరు (587), నెల్లిమర్ల (597), జగ్గంపేట (789), రాజమండ్రి సిటీ (1304), ముమ్మడివరం (1851), తిరువూరు (265), పెనమలూరు (153), విజయవాడ సెంట్రల్ (738), బాపట్ల (1368), బోధన్ (1275), శేరిలింగంపల్లి (1330) నియోజకవర్గాలలో స్వల్ప మెజారిటీతో గెలుపొందారు.
'తమ కోర్కెల జాబితాలో పెక్కింటిన డాక్టర్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఆమోదించినందున ఉద్యోగులలో అత్యధిక సంఖ్యాకులు కాంగ్రెస్ నే ఇష్టపడ్డారన్నది బహిరంగ రహస్యం. పోస్టల్ బ్యాలట్లు ఫలితాలను కాంగ్రెస్ కు అనుకూలంగా మార్చాయని మేము చెబుతూనే ఉన్నాం' అని ఎపి ఎన్ జిఒల సంఘం అధ్యక్షుడు వి. గోపాలరెడ్డి తెలియజేశారు.
'ఎన్నికలలో పోస్టల్ బ్యాలట్ల ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఈ దఫా మూడు లక్షల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్లను కోరుకున్నారు' అని ఎపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్. ఆనందరావు తెలిపారు. ఇది ఇలా ఉండగా, వేతన సవరణను సాధ్యమైనంత త్వరలో అమలు పరచవలసిందిగా ప్రభుత్వానికి ఎపి సెక్రటేరియట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం. హనుమంతరావు విజ్ఞప్తి చేశారు.
News Posted: 19 May, 2009
|