దెబ్బకొట్టిన రెబల్స్
హైదరాబాద్ : మేం బాగుపడలేకపోవచ్చు... మిమ్మల్ని బాగుచేయలేకపోవచ్చు... కానీ చెడగొట్టడానికి సరిపోతాం కదా అన్నట్టుగా తిరుగుబాటు స్వతంత్ర అభ్యర్థులు ప్రధాన పార్టీల అభ్యర్థుల జయాపజయాల్లో కీలక భూమిక పోషించారు. తనకు డిపాజిట్టు గల్లంతైనా పక్కోడు గెలవకూడదనే పట్టుదలతో పోటీలోకి దూకేశారు. వాళ్ళు ఆశించినట్టే చాలా చోట్ల హవా నడిచింది. వీళ్ళ పుణ్యమా అని వందల ఓట్ల తేడాతో పరాజయం పాలై పక్కా అభ్యర్థులు మొఖాలు తెల్లబెట్టారు. అందరూ ఓడిపోలేదు... నలుగురు రెబల్స్ ఎమ్మెల్యేలుగా జయకేతనం ఎగురవేశారు. అనేక నియోజకర్గాల్లో బి-ఫారాలతో పోటీపడిన ప్రధాన పక్షాల అభ్యర్థుల జాతకాలను తారుమారు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి ప్రజారాజ్యం పార్టీ నాయకుడు రాజేశ్వర్ రెడ్డి తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. రంగారెడ్డి జిల్లాలోని కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టిక్కెట్ ఆశించిన శ్రీశైలంగౌడ్ కు టిక్కెట్ లభించకపోవడంతో తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు. మహబూబ్ నగర్ జిల్లాలో మక్తల్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కె.దయాకర్ రెడ్డి తిరుగుబాటు అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు.
చాలా నియోజకవర్గాల్లో తిరుగుబాటు అభ్యర్థులు విజయం సాధించకపోయినా, గట్టి పోటీనిచ్చి సొంత పార్టీ అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు తనయుడు కల్వకుంట్ల తారక రామారావు కరీనంగర్ జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం నుంచి పోటీ చేయగా, అక్కడ పార్టీ నాయకుడు కెకె.మహేందర్ రెడ్డి తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగి రామ్ కు సవాల్ గా నిలిచారు. దీంతో ఇద్దరి మధ్య హోరాహోరీగా పోటీ జరిగింది. కాంగ్రెస్, పిఆర్పీ అభ్యర్థుల జాడే లేదు. చివరకు మహేందర్ రెడ్డిపై రామారావు 171 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో గట్టెక్కారు. నల్లగొండ జిల్లా భువనగిరి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎ.ఉమా మాధవరెడ్డి మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఈ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో మిగతా పార్టీలు పక్కకు పోయి, వీరిరువురి మధ్య ప్రధాన పోటీ జరిగింది. చివరకు ఉమా మాధవరెడ్డి విజయం సాధించారు.
ఇదే జిల్లాలోని ఆలేరు నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి కె.యాదగిరిరెడ్డి పోటీ చేయగా, టిక్కెట్ లభించని సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ కె.నగేష్ రెబెల్ గా (బిఎస్ పి తరఫున) బరిలోకి దిగి భారీగా ఓట్లు చీల్చడంతో కాంగ్రెస్ అభ్యర్థి బిక్షపతిగౌడ్ విజయం సాధించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ టిక్కెట్ ను గొర్లె హరిబాబు నాయుడు ఆశించారు. అయితే ఆయనకు టిక్కెట్ ఇవ్వకుండా టిడిపి మాజీ ఎమ్మెల్యే కళా వెంకట్రావుకు ఇవ్వడంతో హరిబాబు రెబెల్ గా పోటీచేయడంతో కళాకు చుక్కెదురైంది. ఇక మహాకూటమి అభ్యర్థులుగా మంగళగిరి నుంచి సిపిఐ, స్టేషన్ ఘన్ పూర్ నుంచి టిడిపి, వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ పోటీ చేయగా, ఈ మూడు నియోజకవర్గాల్లోనూ సిపిఎం పోటీచేయడంతో కూటమి తలరాతలు మారాయి.
News Posted: 19 May, 2009
|