టీమ్ రాహుల్ ఆశలు
న్యూఢిల్లీ : వారు పిన్న వయస్కులు, ఉత్సాహం ఉరకలెత్తుతున్నవారు. యువ మహిళా కాంగ్రెస్ ఎంపిలు మీనాక్షీ నటరాజన్ (36 మందసౌర్), జ్యోతి మీర్ధా (36 నాగౌర్), శ్రుతి చౌధురి (33 భివాని - మహేంద్రగఢ్), మౌసమ్ నూర్ (28 నార్త్ మాల్డా) వేర్వేరు రాష్ట్రాల నుంచి ఎన్నికైనవారు. కాని అభివృద్ధికి సంబంధించిన తమ అజెండా, రాహుల్ గాంధి పట్ల అభిమానం విషయంలో వారు సంఘటితంగా ఉన్నారు.
'ఆయన చాలా గొప్ప పని చేశారు. కొత్త దృక్పథానికి ప్రోది చేశారు. కొత్త వాతావరణం తీసుకువచ్చారు. మార్పు తీసుకురాగలమని మా వంటి వారు ఆశిస్తున్నారు' అని హర్యానా మాజీ ముఖ్యమంత్రి బన్సీలాల్ మనవరాలు శ్రుతి చెప్పారు. యువజనులను రంగంలోకి తీసుకురావడంపై రాహుల్ దృష్టి కేంద్రీకరించడం వల్ల బయోకెమిస్ట్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన మీనాక్షికి మధ్య ప్రదేశ్ లోని మందసౌర్ స్థానానికి టిక్కెట్ లభించింది. న్యాయ శాస్త్రం కూడా చదువుకున్న 36 సంవత్సరాల ఎఐసిసి కార్యదర్శి మీనాక్షి ఎన్నికలలో గెలుపొందారు. 'మా కులం బ్రాహ్మణుల సమస్యలపై దృష్టి కేంద్రీకరించవలసిందని జనం నన్నుకోరారు. కాని నేను ఎన్నడూ ఆ పంథాను అనుసరించలేదు. వనరులు అందరికీ అందుబాటులో ఉండాలని నేను సూచించాను. పూర్తి పారదర్శకత పాటించాను. అదే సత్ఫలితాన్నిఇచ్చిందని నా భావన' అని రాహుల్ కోర్ బృందంలో సభ్యురాలైన మీనాక్షి చెప్పారు.
ఇక శ్రుతికి ఇప్పటికే పాలన గురించి అవగాహన ఉంది. ఆమె రాజకీయ నాయకురాలైన తన తల్లి కిరణ్ చౌధురికి ఆమె నియోజకవర్గంలో సాయం చేశారు. మౌలిక సదుపాయాల కొరతతో సహా గ్రామస్థుల సమస్యల గురించి బాగా తెలుసు. ఎంపిగా తన కొత్త విధుల గురించి ఆమెకు తెలుసు. 'ఇది పట్టించుకుని చేయవలసిన బాధ్యత. నేను దీనిని నిర్వర్తించవలసి ఉంటుంది' అని ఆమె చెప్పారు. 'నియోజకవర్గం ప్రజల సమస్యల పరిష్కారానికి నేను గట్టిగా కృషి చేయవలసి ఉంటుంది' అని 33 సంవత్సరాల న్యాయవాది శ్రుతి చెప్పారు. ఆమె ఆధ్యాత్మిక భావాలు ఉన్న యువ నాయకురాలు.
ఆ నవతరం రాజకీయ నాయకుల అజెండాలో అభివృద్ధికే అగ్ర స్థానం. 'నాగౌర్ లో నీటి ఎద్దడి ఇంతా అంతా కాదు. అందువల్ల మంచినీటి సరఫరాకే నా ప్రాధాన్యం. అందరికీ అందుబాటులో ఆరోగ్య సేవలు ఉండాలని నా భావన' అని జ్యోతి మీర్ధా చెప్పారు. ఆమె ఐదు పర్యాయాలు నాగౌర్ ఎంపిగా ఉన్న నాథూరామ్ మీర్ధా మనవరాలు.
News Posted: 20 May, 2009
|