ఛాంబర్ల తిప్పలు
హైదరాబాద్ : ఇప్పుడు అధికార, ప్రధాన ప్రతిపక్షం మినహా మిగిలిన పార్టీలు శాసనసభ లోపల ఛాంబర్లు, వెలుపల శాసనసభాపక్ష కార్యాలయాలకోసం వేట ప్రారంభించాయి. వరుసగా రెండవసారి అధికారం చేజిక్కుంచుకున్న కాంగ్రెస్, అలాగే రెండవ సారి పరాజయం పాలైన ప్రధాన ప్రతిపక్ష పాత్రను కొనసాగించనున్న తెలుగుదేశం పార్టీకి పెద్దగా ఇబ్బందులు లేవు. ఆ రెండింటికీ సువిశాలమైన, అన్ని సౌకర్యాలూ కలిగిన ఛాంబర్లు సభ వెలువల వున్నాయి. లోపల లాబీల్లో ముఖ్యమంత్రి వైఎస్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు విడిగా ఛాంబర్లు వున్నాయి. మిగిలిన పార్టీలలో మజ్లిస్ కు సభ లోపల, వెలుపల రెండు కార్యాలయాలు ఉంటే, సిపిఎం, సిపిఐ పార్టీలకు లాబీల్లో మాత్రమే విడిగా గదులున్నాయి. టిఆర్ఎస్ కు కాంగ్రెస్ శాసనసభా పక్ష కార్యాలయం పై అంతస్థులో విడిగా ఒక కార్యాలయం ఉంది. గత శానసభకు ప్రాతినిధ్యం వహించిన సమాజ్ వాది, జనతాపార్టీల గదులు ఈసారి ఇతర పార్టీలకు కేటాయించే అవకాశం వుది. అలాగే సిపిఎం ఒక్క స్థానం మాత్రమే గెలుచుకున్నది కాబట్టి నాలుగు సీట్లు గెలిచిన సిపిఐకి కేటాయించే గదిలోనే చోటు కల్పించనున్నట్లు స్పీకర్ కార్యాలయ వర్గాలు తెలిపాయి.
తెలుగుదేశం పార్టీ తర్వాత అత్యధిక స్థానాలు కలిగిన ప్రజారాజ్యం పార్టీ సంఖ్యాబలానికి సరిపడిన గదిని కేటాయింపు జరిపేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. గత శాసనసభ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మకు కేటాయించిన ఛాంబర్ ను పిఆర్పీ శాసనసభాపక్ష నేత చిరంజీవికి కేటాయించాలని, కుదరకపోతే ప్రస్తుత చీఫ్ విప్ ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి కార్యాలయం లోని విప్ ల ఛాంబర్లను ఏకం చేసి దాన్ని కేటాయించే అవకాశం వుందని ఒక అధికారి తెలిపారు. గత శాసనసభలో ఏడుగురు సభ్యులున్న మజ్లిస్ పార్టీకి ఇప్పటికే శాసనసభ తొలి అంతస్థులో ఒక కార్యాలయం, బయట సిఎల్పీ మొదటి అంతస్థులో మరో కార్యాలయం ఉన్నాయి. ఆ పార్టీకి వాటినే కొనసాగించే అవకాశం వుంది. ఇక టిఆర్ఎస్ కు గత శాసనసభలో లాబీల్లో గది ఏదీ లేదు. 1996లో పార్టీ అధినేత కెసిఆర్ సభకు ప్రాతినిధ్యం వహించిన సందర్భంగా లాబీల్లో మాత్రమే ఒక గది వుండేది. ఈసారి 10 మందితో ఉన్న టిఆర్ఎస్ కు ప్రస్తుతం ఉన్న కార్యాలయాన్ని కొనసాగించే అవకాశం వుంది.
ఇక లోక్ సత్తాపార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ కు ఈసారి సభలో అడుగు పెట్టని సమాజ్ వాది, జనతా పార్టీలకు గతంలో కేటాయించిన గదిని అందుబాటులో ఉంచనున్నట్టు సమాచారం. ఒకే ఒక్క సభ్యుడు ఉన్న పార్టీలకు ఛాంబర్లు కేటాయించాలన్న సంప్రదాయం లేకపోయినా గత సభలో సమాజ్ వాది పార్టీ తరఫున నెగ్గిన డికె అరుణకు కేటాయించడంతో ఈసారి దాన్ని జయప్రకాష్ నారాయణ్ కూ కొనసాగించనున్నట్లు అధికారులు తెలిపారు.
News Posted: 20 May, 2009
|