న్యూఢిల్లీ : ప్రస్తుత ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేసిన కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీని అందుకోలేక పోయింది. దాంతో ఈ సారి కూడా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయక తప్పలేదు. గత 20 ఏళ్లలో ఇది పదో సంకీర్ణ ప్రభుత్వం కానుంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి (1977-79 మినహా) 1989 వరకు కాంగ్రెస్ పార్టీయే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1989లో మొదటిసారి రాజీవ్ గాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ అతి పెద్ద పార్టీ అవతరించినప్పటికీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. దాంతో తొలిసారిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయింది. జనతాదళ్ తో పాటు విపక్షాలన్నీ ఏకమై బీజేపీ, వామపక్షాల సహకారంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే ఆ మిత్రత్వం ఎన్నో రోజులు నిలబడలేదు. ఈ అనైతిక కూటమి ఛిద్రం కావడంతో 1990 నవంబర్ లో ప్రభుత్వం కూలిపోయింది. జనతాదళ్ కాంగ్రెస్ కు మద్దతునివ్వడంతో చంద్రశేఖర్ ప్రధాని అయ్యారు. అయితే ఆ ప్రభుత్వం కూడా కూలిపోవడంతో 1991లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 231 స్థానాలు మాత్రమే వచ్చాయి. దాంతో మళ్లీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ సారి ప్రధాని పివి.నరసింహారావు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటయింది.
1996లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయినా బీజేపీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో అటల్ బిహారీ వాజ్ పేయి నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆ కూటమి 13 రోజుల్లోనే ముక్కలయింది. దాంతో 14 పార్టీల కూటమికి జనతాదళ్ నేతృత్వం వహించి, హెచ్.డి.దేవెగౌడ ప్రధాని అయ్యారు. అయితే ఈ ప్రభుత్వం కూడా సంవత్సరంలోనే కూలిపోయింది. తర్వాత ఇంద్ర కుమార్ గుజ్రాల్ నేతృత్వంలో మార్చి 1997లో 16 పార్టీల కూటమితో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అది కూడా 1997 నవంబర్ లోనే ముక్కలైంది. ఇక 1998 ఫిబ్రవరిలో ఎన్నికలు జరగక తప్పలేదు. ఈ ఎన్నికల్లోనూ బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో వాజ్ పేయి నేతృత్వంలో సంకీర్ణం తప్పలేదు. 1999 ఏప్రిల్ లో బీజేపీ కూ420టమిలోని ఏఐఏడీఎంకే మద్దతు ఉపసంహరించుకోవడంతో సెప్టెంబర్ లో మళ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఆ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మూడోసారి వాజ్ పేయి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే 2004లో బీజేపీ ఓటమి పాలు కావడంతో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చింది. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఐదేళ్లు నిరాటంకంగా పాలించారు. ఆ తరువాత ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా 206 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ యూపీఏ కూటమికి నేతృత్వం వహిస్తోంది. ఈసారి మళ్ళీ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అవుతున్నారు.