పన్ను రాయితీ పెరగవచ్చు
న్యూఢిల్లీ : రానున్న పార్లమెంట్ సమావేశాలలో కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న పూర్తి బడ్జెట్ లో పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుతపు లక్షన్నర రూపాయల నుంచి రూ. 1.75 లక్షలు, రూ. 2 లక్షల మధ్య స్థాయి వరకు పెంచడం ద్వారా మధ్య తరగతి వారికి కొన్ని రాయితీలు కల్పించవచ్చు.
'ఫ్రింజ్ బెనిఫిట్ టాక్స్' (ఎఫ్ బిటి) ఉపసంహరణ రూపంలో ప్రత్యక్ష పన్నుల విభాగంలో మరొక వెసులుబాటు కల్పించవచ్చు. ఈ రెండు ప్రతిపాదనలకు ఆమోదం లభించినట్లయితే ప్రభుత్వానికి సుమారు రూ. 10 వేల కోట్ల మేరకు రాబడి తగ్గవచ్చు. ఈ విషయమై ప్రతిపాదనలను తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలియజేశారు.
ఎఫ్ బిటి ఉపసంహరణతో పాటు పన్ను మినహాయింపు పరిమితిని పెంచడం మధ్య తరగతి వారికి మరొక ప్రోత్సాహకం కాగలదు. ఆరవ వేతన కమిషన్ అమలు తరువాత మిగిలిన 60 శాతం వేతనాల ఎరియర్లను ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉన్నందున మధ్య తరగతివారికి మరింతగా డబ్బు అందుబాటులోకి రాగలదు.
ఎఫ్ బిటిని ఉపసంహరించాలని వాణిజ్య మంత్రిత్వశాఖ కూడా కోరింది. వడ్డీ రేటు సబ్సిడీని కొనసాగించాలని, ఈ సబ్సిడీని ప్రస్తుతం రెండు శాతం నుంచి నాలుగు శాతానికి పెంచాలని కూడా ఈ మంత్రిత్వశాఖ కోరింది.
అయితే, ఎక్సైజ్ సుంకం, కస్టమ్స్ లేదా సర్వీస్ పన్నులో మరింత కోతలు విధించే అవకాశం లేదని ఆర్థిక మంత్రిత్వశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. పరోక్ష పన్నుల వసూళ్ళు తగ్గిపోయి గత ఆర్థిక సంవత్సరాంతానికి లోటు దశకు చేరుకోవడం ఇందుకు కారణమని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ద్రవ్య లోటు పెరిగిపోతుండడంతో ప్రభుత్వానికి తన అభివృద్ధి, సామాజిక పథకాలకు నిధులు సమకూర్చేందుకు రెవెన్యూ తగ్గిపోకుండా చూసుకోవడం కూడా ముఖ్యమే.
ఎగుమతి ప్రాధాన్యం గల యూనిట్లకు పన్ను రాయితీలు విస్తరించాలని, 2010 మార్చి వరకు వడ్డీ రేటు రాయితీని కొనసాగించాలని పరిశ్రమలు చేస్తున్న విజ్ఞప్తిని వాణిజ్య మంత్రత్వశాఖ గట్టిగా సమర్థిస్తున్నది. ఆర్థిక మంత్రిత్వశాఖకు సమర్పించిన తమ ప్రతిపాదనలలో పారిశ్రామిక మండలులు పెట్టుబడిని పెంచేందుకు, అదనపు డిమాండ్ ను సృష్టించేందుకు వీలు కల్పించే చర్యలు తీసుకోవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.
News Posted: 21 May, 2009
|