వర్షాలు తగ్గుతాయి!
పుణె : వాతావరణంలో మార్పు వల్ల రానున్న 50 సంవత్సరాలలో వర్షాల సరళి మారిపోగలదు. ఫలితంగా ఒక సంవత్సర కాలంలో వర్షాలు కురిసే రోజులు తగ్గి, వర్షపాతం తీవ్రత పెరగవచ్చు. దేశంలోని ప్రముఖ వాతావరణ పరిశోధనా సంస్థ పుణెలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మీటియారాలజీ (ఐఐటిఎం)లో శాస్త్రవేత్తలు ఈ అభిప్రాయం వెలిబుచ్చారు.
'వర్షాలు కురిసే రోజుల సంఖ్య 8 నుంచి 10 శాతం వరకు తగ్గిపోగలదని, వర్షపాతం తీవ్రత పెరగగలదని మా అధ్యయనం సూచిస్తున్నది' అని ఐఐటిఎం వాతావరణ మార్పు విభాగం ప్రోగ్రామ్ మేనేజర్ కె. కృష్ణ కుమార్ తెలియజేశారు. 'పరిసరాలలో మరింత తేమ ఏర్పడుతుంది కనుక వర్షపాతం పెరుగుతుంది. వాతావరణంలో మార్పుల కారణంగానే రుతుపవనాల లక్షణాల ఈ మార్పులు సంభవిస్తున్నాయి' అని ఆయన వివరించారు.
ఈ మార్పుల ప్రభావం ఈ శతాబ్దం ద్వితీయార్ధంలో ఉంటే 2050 అనంతరం మరింత స్పష్టంగా కనిపించగలదని కుమార్ తెలిపారు. ' వచ్చే 30, 40 సంవత్సరాలలో పెద్దగా మార్పులేమీ కనిపించవు. సగటున దేశంలో 50 నుంచి 60 రోజుల పాటు వర్షం పడగలదు. ఇది దాదాపు 5 నుంచి 6 రోజుల వరకు తగ్గగలదు' అని ఆయన సూచించారు.
వాతావరణం మార్పు ఉష్ణోగ్రతను కూడా ప్రభావితం చేయగలదు. 'ఇది మరింత ఆందోళనకరమైనది. ఎందుకంటే ఉష్ణోగ్రతలో పెరుగుదల ప్రభావం వ్యవసాయంపైన, ప్రజల ఆరోగ్యంపైన పడుతుంది' అని ఆయన చెప్పారు.
ఉష్ణోగ్రత ఈ శతాబ్దాంతానికి సుమారు రెండు డిగ్రీల సెల్షియస్ మేరకు పెరగవచ్చునని, పగటి ఉష్ణోగ్రతలు, రాత్రి ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతాయని ఆయన సూచించారు. ఈ మార్పుల ప్రభావం మధ్య, ఉత్తర భారతం వంటి ప్రాంతాలలో మరింత స్పష్టంగా కనిపించగలదని కుమార్ తెలిపారు.
News Posted: 21 May, 2009
|