స్టార్లు వెనక్కు తగ్గుతారా?
హైదరాబాద్ : రాజకీయ నాయకుని అవతారం దాల్చిన మెగాస్టార్ చిరంజీవి ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన దృష్ట్యా చలనచిత్ర పరిశ్రమలో అగ్రస్థానంలో ఉన్నవారు మినహా మరే ఇతర నటుడూ లేదా నటీ భవిష్యత్తులో రాజకీయ అరంగేట్రానికి వెనుకాడవచ్చునని కాంగ్రెస్ శాసనసభా పక్షం (సిఎల్ పి) అభిప్రాయపడుతున్నది.
పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గంలో పరాజయం పొందిన ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ) అధ్యక్షుడు చిరంజీవి కాకుండా తెలుగు దేశం పార్టీ (టిడిపి) అభ్యర్థులు బాబూ మోహన్, ఆర్.కె. రోజా, మురళీ మోహన్, పిఆర్పీ అభ్యర్థులు యు కృష్ణంరాజు, పోసాని కృష్ణమురళితో సహా సినీ తారలు పలువురు ఎన్నికలలో గెలవలేకపోయారు. చిరంజీవి నిర్వహించిన సభలకు లేదా రోడ్ షోలకు స్పందన భారీగా ఉందంటే అందుకు కారణం సినీ తారలను భావి నాయకులను చేయడానికి కాకుండా వారిని బాగా దగ్గర నుంచి చూడవచ్చుననే ఆశతో జనం రావడమని ఇటీవలి ఎన్నికలలో గెలుపొందిన సిఎల్ పి సభ్యులు అభిప్రాయం వెలిబుచ్చారు.
సినిమాలు, రాజకీయ జీవితం పూర్తిగా భిన్నమైనవి. వాస్తవంలో ఆ సినీ స్టార్ల అభిమానులు దాదాపు అన్ని రాజకీయ పార్టీలలోను ఉన్నారు. అయితే, రాజకీయాలలోకి ప్రవేశించిన తమ అభిమాన హీరోకు లేదా హీరోయిన్ కు అనుకూలంగా వారు తమ అభిప్రాయాన్న మార్చుకోరు. అదీ కాకుండా ఎన్.టి. రామారావు రాజకీయ రంగ ప్రవేశానికి, అఖండ విజయానికి దోహదం చేసిన పరిస్థితులు, చిరంజీవి రాజకీయ అరంగేట్రానికి దారి తీసిన పరిస్థితుల మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ శాసనసభ్యులు భావిస్తున్నారు. 1980 దశకంలో వలె కాకుండా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో రాజకీయ వెలితి ఏమీ లేదని వారు భావిస్తున్నారు.
సినీ నటులు, టిడిపి ప్రధాన ప్రచారకులు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన ప్రతిపక్షంపై సానుకూల ప్రభావం చూపలేకపోయారు. చివరకు చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్, కుమారుడు రామ్ చరణ్ తేజ, బావమరిది కుమారుడు అల్లు అర్జున్ చేసిన ప్రచారం కూడా పిఆర్పీకి ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. ప్రస్తుత పరిస్థితులలో చివరకు రజనీకాంత్ వంటి సూపర్ స్టార్లు కూడా రాజకీయాలలోకి ప్రవేశించడానికి వెనుకాడగలరు. సినీ స్టార్లు తమ తమ రంగాలకే పరిమితమై పోవడం శ్రేయస్కరమని సిఎల్ పి సభ్యులు అభిప్రాయం వెలిబుచ్చారు.
News Posted: 21 May, 2009
|