వివాదాల బాలు, రాజా
చెన్నై : కేంద్ర మంత్రివర్గంలో డిఎంకె స్థానాలకు సంబంధించి వివాదాలకు కేంద్ర బిందువులుగా ఉన్న ఇద్దరు నాయకులు పరస్పరం పూర్తిగా భిన్నమైన వ్యక్తిత్వాలు కలవారు. 68 సంవత్సరాల టి.ఆర్. బాలు పొడగరి, చక్కని శరీర సౌష్టవం కలవాడు. మాట కరకు. అధికారులను ఏమాత్రం లెక్క చేయరు. ఢిల్లీలో డిఎంకె తరఫున పనులు చక్కబెట్టుతుంటారు. ఇక పొట్టివాడైన 46 సంవత్సరాల రాజా మృదుభాషి. తాను దళితుడిననే మాట మరవరు. ఆత్మ విశ్వాసం లోపించినట్లుగా కూడా కనిపిస్తారు. ఇది ఎంత వరకు వెళ్ళిందంటే తన మంత్రిత్వశాఖలో ప్రధానమైన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముందు పార్టీ నాయకత్వాన్ని సంప్రదిస్తుంటారని ప్రతీతి. పని సామర్థ్యం కూడా అంతంత మాత్రమేనని అంటారు.
అయితే, ఆ ఇద్దరూ నిర్వహించిన మంత్రిత్వశాఖల చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. బాలు నౌకాయాన, రోడ్డు రవాణా, రహదారుల శాఖను నిర్వహించగా రాజా కమ్యూనికేషన్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రిగా ఉన్నారు. న్యాయవాది అయిన రాజా అజమాయిషీలో కమ్యూనికేషన్ల మంత్రిత్వశాఖ 2జి స్పెక్ట్రమ్ లైసెన్స్ సొమ్ముగా రూ. 25 వేల కోట్ల ఆదాయం రాకుండా నష్టం కలిగించారనే ఆరోపణ వచ్చింది. రాజా 2007 మే నుంచి మంత్రిగా ఉన్న కాలంలో కమ్యూనికేషన్ల మంత్రిత్వశాఖ 2జి స్పెక్ట్రమ్ ను వేలం వేసి ఉంటే ప్రభుత్వానికి ఆ మేరకు ఆదాయం వచ్చి ఉండేది. వేలం వేయడానికి బదులు మంత్రిత్వశాఖ రెండు గంటల స్వల్ప వ్యవధిలో అమ్మకాలతో 'ముందు వచ్చినవారికి ముందు' అనే పద్ధతిలో లైసెన్సులు ఇచ్చింది. ఇందులో తన పాత్ర ఏమీ లేదని రాజా ఖండించినప్పటికీ ఖజానాకు వాటిల్లిన నష్టంపై ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రశ్నలను సంధించింది.
మారన్ సోదరులు దయానిధి, కళానిధి డిఎంకె అధినేత ఎం. కరుణానిధి కుటుంబానికి దూరమైన సమయం కూడా అదే కావడం గమనార్హం. మారన్ ల యాజమాన్యంలోని సన్ టివి, దినకరన్ దినపత్రిక 'స్పెక్ట్రమ్ కుంభకోణం'పై ఉధృతంగా ప్రచారం కూడా ప్రారంభించింది. మారన్ సోదరులు కరుణానిధితో రాజీ పడిన మరుక్షణం ఆయన స్పెక్ట్రమ్ కుంభకోణాన్ని ముగిసిన అధ్యాయంగా పేర్కొన్నారు.
ఇక నౌకాయాన, రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రిగా బాలు కేంద్రంపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చి రూ. 21 వేల కోట్లు ఖర్చు కాగల సేతుసముద్రం షిప్పింగ్ కెనాల్ (ఎస్ఎస్ సి) ప్రాజెక్టును మంజూరు చేయించుకున్నారు. మత్స్యకారులు, పర్యావరణవేత్తల నుంచి అభ్యంతరాలు ఎంతగా వ్యక్తం అవుతున్నప్పటికీ ఆయన ఈ ప్రాజెక్టు అమలుకు పూనుకున్నారు. ఈ ప్రాజెక్టు ఆచరణ సాధ్యం కాదని నిపుణులు పేర్కొన్నప్పటికీ, బాలు ప్రాజెక్టు విషయంలో ముందుకు సాగారు. చివరకు సుప్రీం కోర్టు ఆయన దూకుడుకు అడ్డుకట్ట వేసింది. ఈ ప్రాజెక్టు లాభదాయకమైన డ్రెడ్జింగ్ కాంట్రాక్టులతో కూడుకున్నది. 'ఈ ప్రాజెక్టు లాభదాయకమైనది కాదని, డ్రెడ్జింగ్ కాంట్రాక్టుల రూపంలో ప్రజల డబ్బు ఖర్చుకు దారి తీస్తుందని కాంగ్రెస్ గ్రహించినట్లున్నది' అని ఈ ప్రాజెక్టు సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
ఇక రహదారుల ప్రాజెక్టులు మందకొడిగా సాగడానికి బాలుదే బాధ్యత అని ప్రధాని కార్యాలయం (పిఎంఒ) అధికారులు, కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్ హెచ్ఎఐ) చైర్ పర్సన్ ను తరచు మారుస్తున్నందుకు, సంస్థ నిర్వహణలో జోక్యం చేసుకుంటున్నందుకు రహదారుల మంత్రిత్వశాఖను 2008 డిసెంబర్ లో ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా విమర్శించింది. రెండున్నర సంవత్సరాలలో సంస్థ చైర్ పర్సన్ లు ఐదుగురు మారారు.
News Posted: 23 May, 2009
|