'రైలింజన్'కు గుడ్ బై
హైదరాబాద్: సామాజిక న్యాయాన్ని అమలు చేసినందుకే ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైందని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి తెలిపారు. మూడు రోజులుగా ప్రజారాజ్యం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమీక్షలు శనివారం ముగిసాయి. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన సమీక్ష వివరాలను తెలిపారు. మార్పు ఆశిస్తూ ప్రజలు పార్టీ పట్ల ఆదరణ చూపినా, దాన్ని ఓట్లుగా మలుచుకోవడంలో విఫలం చెందడం కూడా పార్టీ పై ప్రభావం చూపిందన్నారు. ఇంతటి ఘోరమైన ఫలితాలను తాము ఊహించలేదన్నారు. కనీసం నలభైశాతం వాటా అయినా లభిస్తుందని అనుకున్నానన్నారు. ప్రధాన మంత్రి మన్మోహన్ పనితీరు ఆర్థిక విధానాలు కాంగ్రెస్‌ను గెలిపించాయ న్నారు. పార్టీ ఏర్పాటుకు ఎన్నికలకు మధ్య తక్కువ సమయం ఉన్నందువల్లే ఓటమి చెందామని విశ్లేషణలో నాయకులు వెల్లడించారన్నారు. గెలుపు గుర్రా లకే టికెట్లు కేటాయించకుండా సామాజిక న్యాయం పాటించడం కూడా నష్ట పోయినట్లు కమిటీలో సభ్యులు తేల్చారన్నారు.
ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వేరు, ఇపుడున్న రాజకీయ పరిస్థితులు వేరన్నారు. కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలకు ధీటుగా ప్రజారాజ్యం పార్టీకి బలమైన కేడర్ లేకపోవడం కూడా తమ పార్టీకి ప్రతికూల అంశం అన్నారు. అభ్యర్థుల ఎంపిక లో జాప్యంకూడా కొంత నష్టం చేసిందన్నారు. రైలు ఇంజన్ గుర్తువల్ల కూడా విజయావకాశాలు దెబ్బతిన్నట్లు రాజకీయ వ్యవహారల కమిటీ సమీక్షలో స్పష్ట మైందన్నారు. ఎన్నికల గుర్తుగా రైలు ఇంజన్‌ను మార్చి మరో గుర్తుకోసం ఎన్ని కల కమిషన్‌కు దరఖాస్తు చేయనున్నట్లు చిరంజీవి పేర్కొన్నారు. పార్టీలో అల్లు అరవింద్ ఎక్కువ బాధ్యతలు మోయడం వలనే ఆయనపై విమర్శలు కూడా అధికంగా వచ్చాయన్నారు. అభ్యర్థుల ఆస్తులు రాయించుకున్నట్లు ఆధారాలు చూపాలని సవాల్ చేశారు. అసెంబ్లీలో 18 మంది పార్టీ ఎమ్మెల్యేలతోనే ప్రజాసమస్యలపై పోరాటం సాగిస్తామన్నారు. పార్టీ పటిష్టతకోసం రేపటినుంచే పరిశ్రమిస్తామన్నారు.
News Posted: 23 May, 2009
|