6 నెలలు టిడిపి మూగనోము
హైదరాబాద్ : ఎన్నికలలో ఎదురైన పరాజయం షాక్ నుంచి తేరుకుంటున్న తెలుగు దేశం పార్టీ (టిడిపి) నాయకత్వం కొత్త ప్రభుత్వ విధానాలపై కనీసం ఆరు నెలల పాటు 'మూగనోము' పట్టాలని నిశ్చయించింది. టిడిపి నిర్ణయానుసారం, ప్రభుత్వ విధానాలలో లోటుపాట్లను పార్టీ నాయకులు తెలియజెప్పి వాటిని సరిదిద్దేందుకు చర్యలను సూచిస్తారే తప్ప వాటిని ఆక్షేపించరు. ఈ పర్యాయం తమ వ్యూహాన్ని మార్చుకోవాలని టిడిపి నాయకులు నిర్ణయించుకున్నారు. ఇంతకముందు ప్రభుత్వంపై తాము దూకుడుగా సాగించిన ప్రచారం తమకే బెడిసికొట్టిందని వారు భావించడమే ఇందుకు కారణం. 2004 మే 14న ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే టిడిపి తన దాడి ప్రారంభించింది. ' 2004లో మేము ఓడిన మరుక్షణం నుంచే ప్రభుత్వంపై దూకుడుగా వ్యతిరేక ప్రచారం ప్రారంభించాం. డాక్టర్ రాజశేఖరరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా మేము లక్ష్యం చేసుకున్నాం. ప్రభుత్వం అమలు పరిచిన ప్రతి విధానాన్ని మేము దుయ్యబట్టాం. అయితే, ప్రజలు మా దూకుడు తత్వాన్ని ఆమోదించలేదని మా విశ్లేషణ సూచించింది. పైగా నిరంతరాయంగా మేము విమర్శలు చేస్తుండడం వల్ల ప్రభుత్వం తన తప్పులను సరిదిద్దుకున్నది' అని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు ఒకరు వివరించారు.
తమ కొత్త వ్యూహం ప్రకారం, టిడిపి ఎన్టీఆర్ భవన్ లో మీడియా సమావేశాల సంఖ్యను తగ్గిస్తుందని పార్టీ వర్గాలు తెలియజేశాయి. ఇప్పటి వరకు టిడిపి నాయకులు పార్టీ కార్యాలయంలో రోజూ విలేకరుల సమావేశాలు రెండింటిని నిర్వహిస్తుండేవారు. అయితే, ఇప్పుడు రోజు విడిచి రోజు ఒక విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం కద్దు. కొత్త ప్రభుత్వ పథకాలను, విధానాలను విమర్శించరాదని పార్టీ నాయకులను అధినాయకత్వం కోరింది. ఎందుకంటే ఇలా విమర్శించడం అధికార పార్టీకే అనవసరంగా మేలు చేస్తుందని నాయకత్వం భావిస్తున్నది. 'పైగా, ప్రభుత్వానికి తప్పులు చేయడానికి మేము కొంత వ్యవధి ఇవ్వాలి. తరువాత ఆ తప్పులను మేము ఎండగడతాం. 2004లో ఈ సాధారణ రాజకీయ వ్యూహాన్ని అనుసరించడంలో మేము విఫలం అయ్యాం. ఈ దఫా మేము జాగరూకతతో వ్యవహరిస్తాం' అని టిడిపి సీనియర్ నాయకుడు మరొకరు చెప్పారు. మొదటి, రెండవ అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వ విధానాలలో లోటుపాట్లు కనుగొనడానికి టిడిపి ప్రయత్నిస్తుందని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు డాక్టర్ నాగం జనార్దనరెడ్డి చెప్పారు.
ఇది ఇలా ఉండగా, పార్టీ తెలంగాణ అనుకూల వైఖరిపై మహానాడులో సమీక్ష జరపవలసిందిగా అధినాయకత్వంపై పార్టీ నాయకులు పలువురు అంతకంతకు ఒత్తిడి తీసుకువస్తున్నారు. తెలంగాణ అంశంపై టిడిపి తన వైఖరిని పూర్తిగా మార్చుకోవడం వల్ల హైదరాబాద్ లోను, పరిసర ప్రాంతాలలోను ఎన్నికలలో పార్టీ అవకాశాలు దెబ్బ తిన్నాయని దక్షిణ తెలంగాణ, కోస్తా ఆంధ్ర ప్రాంతాలకు చెందిన నాయకులు అభిప్రాయం వెలిబుచ్చారు.
News Posted: 25 May, 2009
|