చిరు, జెపితో సభకు వన్నె
హైదరాబాద్ : ఈ దఫా రాష్ట్ర శాసనసభలో చర్చలు ఆసక్తిదాయకంగా సాగగలవు. ఇద్దరు కొత్త నాయకులు చిరంజీవి, జయప్రకాశ్ నారాయణ్ సభలో తమ గొంతు విప్పబోతున్నారు కదా! తెలుగు చిత్ర రంగంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందిన చిరంజీవి రాజకీయ రంగంలోకి ప్రవేశించగా జయప్రకాశ్ నారాయణ్ (జెపి) మెరుగైన రాజకీయ వ్యవస్థ కోసం ఉద్యమాన్ని ప్రారంభించిన మాజీ ఐఎఎస్ అధికారి. చిరంజీవికి సభలో 17 మంది పార్టీ సహచరులు తోడుగా ఉంటుండగా జయప్రకాశ్ నారాయణ్ లోక్ సత్తా పార్టీకి ఏకైక ప్రతినిధి. ప్రజల సమస్యల నుంచి సామాజిక అంశాల వరకు వివిధ అంశాలపై సభలో వారి చేసే ప్రసంగాలు టివి వీక్షకుల దృష్టిని ఆకర్షించగలవు. వారి కొత్త అవతారాన్ని చూడాలనే ఆత్రుతతో టివి వీక్షకులు ఉంటారు.
శాసనసభలో చర్చలు ఎప్పుడూ వాడిగా వేడిగా సాగుతుంటుంటాయి. ఏ సభ్యునికైనా తన అభిప్రాయాన్ని వినిపించడానికి, అందరి దృష్టికీ తీసుకురావడానికి ఎంతో ప్రయాస పడవలసి వస్తుంది. ఇటువంటి స్థితిలో ఆ ఇద్దరూ సభా వేదికపై ఎలా రాణిస్తారనేది ఆసక్తి కలిగించక మానదు. ఈ సందర్భంగా గమనార్హమేమంటే, రాజకీయ చర్చల ప్రమాణాన్ని పెంచడం, చర్చలకు హుందాతనాన్ని తీసుకురావడం లక్ష్యంగా తాము రాజకీయాలలోకి వచ్చామని ఆ ప్రముఖులిద్దరూ ప్రకటించారు. వారిద్దరూ తమ ఎన్నికల ప్రచార సమయంలో ప్రజల సమస్యలు పట్టని ప్రస్తుత రాజకీయ నాయకుల శ్రేణిపైన, సభలో చర్చల స్థాయి దిగజారుతుండడంపైన తీవ్రంగా విరుచుకుపడ్డారు.
ఆ ఇద్దరు చేసే ప్రసంగాలను, వాడే భాషను నారా చంద్రబాబు నాయుడు, డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి, కొణిజేటి రోశయ్య (ఎంఎల్ సి), ధర్మాన ప్రసాదరావు, కె. జానారెడ్డి వంటి రాజకీయ నాయకుల ప్రసంగాలతో జనం పోల్చి చూస్తారు. ఆసక్తికరమైన విషయమేమంటే, వారిద్దరూ సభలో తమ తమ సంఖ్యాబలం కారణంగా వేర్వేరు వరుసలలో కూర్చుంటారు. చిరంజీవి ఫ్లోర్ నాయకులకు ఉద్దేశించిన ముందు వరుసలో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)కు చెందిన ఈటెల రాజేందర్ తో పాటు మూడవ బెంచ్ పై కూర్చుంటారు. జయప్రకాశ్ నారాయణ్ బహుశా సిపిఎం శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డితో పాటు రెండవ వరుసలో కూర్చొనవచ్చు.
ఇక జయప్రకాశ్ నారాయణ్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు క్షుణ్ణంగా తెలిసినవారు కాగా చిరంజీవి తన ప్రావీణ్యానికి పదును పెట్టుకోవలసి ఉంటుంది. తాను క్రమం తప్పకుండా సభకు హాజరు కాగలనని, సభకు హాజరయ్యే ముందు తన హోమ్ వర్క్ చేసుకుంటానని చిరంజీవి ఇప్పటికే ప్రకటించారు. అయితే, వారిద్దరికీ సభలో ఎంత సమయం దక్కుతుందనేదే ప్రశ్న.
News Posted: 25 May, 2009
|