అద్వానీ వింత వాదన
అహ్మదాబాద్ : ఇటీవల జరిగిన పార్లమెంటరీ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన తరువాత భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఆ విషయాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు లేదు. బిజెపి సీనియర్ నాయకుడు, గాంధీనగర్ ఎంపి ఎల్.కె. అద్వానీ ఆదివారం అహ్మదాబాద్ లో పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తూ, 'పార్లమెంటరీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి గెలుపూ కాదు బిజెపికి ఓటమీ కాదు' అని వ్యాఖ్యానించారు. 'ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసినందుకు తృతీయ ఫ్రంట్ కు గుణపాఠం నేర్పాలని ఓటర్లు కోరుకున్నారు' అని ఆయన పేర్కొన్నారు.
సిపిఎం లేకుండా కాంగ్రెస్ కు రెండవ అవకాశం ఇవ్వాలని ఓటర్లు కోరుకున్నారని అద్వానీ చెప్పారు. 'కాంగ్రెస్ తాను చేసిన వాగ్దానాలను నెరవేరుస్తుందనే ఆశతో దేశ ప్రజలు చెప్పుకోదగిన మెజారిటీతో ఆ పార్టీకి రెండవ అవకాశం ఇచ్చారు. ప్రజలు ప్రతిపక్ష పాత్ర అప్పగించిన బిజెపి, ఎన్ డిఎ అలాగే వ్యవహరించి, వాగ్దానాలు నెరవేర్చేట్లుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తాయి' అని ఆయన చెప్పారు.
అయితే, ఆశ్యర్యకరంగా ఈ సమావేశంలో ఏ సందర్భంలో కూడా బిజెపి నాయకులు కాంగ్రెస్ పార్టీపై గాని, వామపక్షాలపై గాని ఆరోపణలు చేయడం లేదా వాటిని విమర్శించడం చేయలేదు. చివరకు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి కూడా కాంగ్రెస్ పైన, సోనియాపైన లేదా రాహుల్ పైన విమర్శనాస్త్రాలు సంధించకుండా సంయమనం పాటించారు.
కాని, మోడి తనను మాస్టర్ బ్యాట్స్ మన్ సచిన్ టెండూల్కర్ తో పోల్చుకున్నారు. పని తీరుకు కాకుండా జనం ఆశయాకాంక్షలకు తగినట్లుగా వ్యవహరించనందుకు తనను విమర్శిస్తున్నారని మోడి చెప్పారు. 'సచిన్ టెండూల్కర్ 90 పరుగులకు అవుటైనట్లయితే, సెంచరీకి దగ్గరలో అవుటైనందుకు అతనిని జనం విమర్శిస్తారు. అతని నుంచి జనం ఎంతో ఆశిస్తున్నారు కనుక అలా విమర్శిస్తుంటారు. అదే విధంగా తమ ఆశలకు తగినట్లుగా నేను వ్యవహరించనందుకు జనం నన్ను విమర్శిస్తుంటారు. నా పని తీరుకు ఎవ్వరూ నన్ను విమర్శించలేదు' అని మోడి పేర్కొన్నారు.
సింగపూర్ నుంచి తీసుకువచ్చిన రెండు జతల చిరుతపులుల ప్రస్తావనను కూడా నరేంద్ర మోడి తీసుకువచ్చారు. చిరుతలు కనిపించే ఏకైక రాష్ట్రం గుజరాత్ అని ఆయన చెప్పారు.
News Posted: 25 May, 2009
|