రాహుల్ ది బాక్సర్
న్యూఢిల్లీ : నాగరికత విరాజిల్లుతున్నప్పుడు అన్ని దారులూ రోమ్ నగరానికే వెళ్ళేవి... అలానే కాంగ్రెస్ ను విజయం వరించిన నేపథ్యంలో అన్ని ప్రశంసలూ రాహుల్ గాంధీనే ముంచెత్తుతున్నాయి. ఆయన గతంలోనూ, వర్తమానంలోనూ ఏ పని చేసినా అది అద్భుతం, అమోఘం అంటూ మీడియా పొగిడేస్తోంది. ఆయన ఎప్పుడెప్పుడో చేసిన విన్యాసాలను తవ్వితోడి జనాలకు అందిస్తోంది. అదిగో అలాంటి కోవలోకి మరో కొత్త కథనం వచ్చి చేరింది. రెండేళ్ళ క్రితం రాహుల్ గాంధీ బాక్సింగ్ నేర్చుకున్నారట. అందుచేత రాహుల్ గొప్ప క్రీడాకారుడే కాక ఆరోగ్యపరంగానూ, మానసికంగానూ చాలా దృఢమైన వాడని ప్రపంచానికి చాటి చెప్పింది. ఇంతకూ కథ ఏమిటంటే ఆత్మరక్షణ విద్యను నేర్చుకోవడంలో భాగంగా రాహుల్ గాంధీ గత ఏడాది ఓ రెండు నెలల పాటు బాక్సింగ్ శిక్షణ పొందారు. ద్రోణాచార్య అవార్డు గ్రహీత ప్రముఖ బాక్సింగ్ కోచ్ ఓం ప్రకాష్ భరద్వాజ్ రోజూ రాహుల్ నివాసానికి వెళ్ళి బాక్సింగ్ లో మెళుకువలను నేర్పారు. అంతటి నాయకుడూ రాజకీయంగా అసలు తీరుబాటు దొరకకపోయినా రాహుల్ పట్టుదలతో బాక్సింగ్ నేర్చుకున్నాడని, అలాంటి యువకుడికి బాక్సింగ్ నేర్పే అవకాశం రావడం తన అదృష్టమని డెబ్బైఏళ్ళ భరద్వాజ్ ఇప్పటికీ మురిసిపోతున్నారు.
`రాహుల్ బాక్సింగ్ నేర్చుకుంటానంటే నేను మొదట్లో చాలా ఆశ్చర్యపోయాను ఎందుకంటే అతను గోదాలోకి దిగి ఎప్పుడూ బాక్సింగ్ చేయడు. కాని తర్వాత అర్థమైంది ఆ యువకుడు స్వీయరక్షణకు ఉపయోగపడే యుద్ధ కళలను గురించి తెలుసుకోవాలనే ఆసక్తి వున్నవాడని. రాహుల్ అద్భుతమైన ఈతగాడు. మంచి షూటర్. గుర్రపు స్వారీ కూడా బాగా చేయగలడు. నేను గమనించిందేమిటంటే రాహుల్ క్రీడలను బాగా ఇష్టపడతాడు. అన్నీ అంశాల పట్ల కనీస పరిజ్ఞానాన్ని సంపాదించాలని తహతహలాడుతాడు. దేనికోసమైనా ప్రయత్నం చేయాలనుకుంటాడు. ఒక్క నిముషం కాలాన్ని కూడా వృదా చేయడానికి ఇష్టపడడు.' అని భరద్వాజ్ రాహుల్ గుణగణాలను ఏకరువు పెట్టాడు.
బాక్సింగ్ లో వున్న చాలా మెళుకువలు రాహుల్ కి తెలుసునని, వాటిని గురించి తనతో ఎప్పుడూ చర్చిస్తూనే వుండేవాడని వివరించారు. రాహుల్ కు అలసటనేదే తెలియదు.శిక్షణలో భాగంగా ఇంట్లో గ్రౌండ్ చుట్టూ ఒకసారి పరిగెత్తి రావాలని తాను సూచిస్తే ఆయన రెండు సార్లు పరిగెత్తడానికి ఆసక్తి చూపించాడనీ, అలానే బాక్సింగ్ ప్యాడ్ పై పిడిగుద్దులు విసరడంలో కూడా అలసట చెందడని భరద్వాజ్ చెప్పారు. అలానే మానవీయ విలువలను పాటించడంలో రాహుల్ గొప్పవాడని, ఒకసారి తాను తాగటానికి మంచినీళ్లు అడిగితే ఆ పనిని ఎవరికీ చెప్పకుండా రాహులే వంటగదికెళ్ళి నీళ్లు పట్టుకొచ్చి ఇచ్చారని వివరించారు. శిక్షణ ముగిసిన తర్వాత తనను గేటు వరకు సాగనంపుతున్న రాహుల్ ను ఒకసారి సోనియా గాంధీ పిలిచారనీ, కానీ గురువు గారిని సాగనంపి వస్తానని తల్లికి సమాధానం చెప్పి రాహుల్ తన వెంటే నడిచాడనీ భరద్వాజ్ సంబరంగా చెబుతారు. ఒకసారి రాహుల్ బాక్సింగ్ నేర్చుకుంటుంటే ప్రియాంక కూడా వచ్చి తనకూ నేర్పమని అడిగిందనీ ముచ్చటగా, మురిపెంగా చెబుతాడు.
News Posted: 26 May, 2009
|