అధికారంలో ఆదిశక్తులు
హైదరాబాద్ : ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపులో మహిళలు కీలక పాత్ర పోషించడంతో దానికి ప్రతిఫలంగానే రాష్ట్రమంత్రి వర్గంలో మహిళలకు పెద్ద పీట వేసినట్లు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో నలుగురు మహిళా మంత్రులు మాత్రమే ఉండగా, తాజాగా కొలువు తీరిన వైఎస్ కేబినెట్ లో ఆరుగురు మహిళలకు అవకాశం కల్పించారు. అంతే కాకుండా కీలకమైన హోం, రోడ్లు, భవనాలు, సమాచార, పర్యాటక, చిన్న తరహా పరిశ్రమలు, చిన్న తరహా నీటి పారుదల వంటి శాఖలు మహిళా అభ్యర్థులకు కేటాయించడం పట్ల ఇటు పార్టీ మహిళా కార్యకర్తల్లో, అటు మహిళా లోకంలో హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా ఏర్పాటైన రాష్ట్ర మంత్రి వర్గంలో మహిళలకు సముచిత స్థానం లభించిందని ఆ పార్టీనేతలు చెబుతున్నారు.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ సానుకూలంగానే ఉన్నప్పటికీ ఆ స్థాయిలో కాకపోయినా 23 శాతం మేరకు మంత్రి వర్గంలో వారికి స్థానం కల్పించింది. జె.గీతారెడ్డి (జహీరాబాద్), సునీతా లక్ష్మారెడ్డి (నర్సాపూర్), కొండా సురేఖ (శాయంపేట), సబితాఇంద్రారెడ్డి (మహేశ్వరం), డి.కె.అరుణ (గద్వాల), గళ్ళ అరుణకుమారి (చంద్రగిరి)లకు ఈ సారి మంత్రి వర్గంలో అవకాశం కల్పించారు. వీరిలో గీతారెడ్డి, సబితారెడ్డి, అరుణకుమారి గతంలో మంత్రులుగా పనిచేసిన వారు కాగా మిగతా ముగ్గురు అరుణ, సునీతా, సురేఖ తొలిసారి మంత్రి బాధ్యతలు నిర్వహించబోతున్నారు. గతంలో ప్రాధమిక విద్యా, ఆ తరువాత మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్వహించిన ఎస్.రాజ్యలక్ష్మి ఈ సారి ఎన్నికల్లో పరాజయం పొందడంతో అనుభవం ఉన్న మహిళా మంత్రి రాష్ట్ర కేబినెట్ కు అందుబాటులో లేకుండా పోయారు. ఇక ప్రాంతాల వారిగా చూస్తే తెలంగాణ నుంచి ఐదుగురు మహిళలకు అవకాశం దక్కడం విశేషం. రాయలసీమ నుంచి గల్లా అరుణకుమారిని మంత్రి వర్గంలో తీసున్నారు. కాగా కోస్తా నుంచి మహిళా ఎమ్మెల్యేలు ఏ ఒక్కరికి అవకాశం కల్పించలేదు.
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు అసెంబ్లీ స్థానంలో పిఆర్పీ అధినేత, మెగా స్టార్ చిరంజీవిపై సంచలన విజయం సాధించిన ఉషారాణికి మంత్రి పదవి రావడం ఖాయమని తొలుత జోరుగా ప్రచారం జరిగినా ఆమెకు ఆ అదృష్టం దక్కలేదు. మెదక్ జిల్లా నుంచి అత్యధికంగా ఇద్దరు మహిళలకు మంత్రి వర్గంలో చోటు దక్కడం గమనార్హం. గతంలో కేబినెట్ లో మహిళా అభ్యర్థులను తీసుకుంటే సాధారణంగా మహిళా, స్త్రీ, శిశు సంక్షేమం, కుటుంబ సంక్షేమం వంటి శాఖలు కేటాయించడం, సీనియర్ మంత్రులకు తోడుగా సహాయ మంత్రులుగా నియమించడం జరిగేది. అందులో ఎవరూ ఊహించని విధంగా సబితా ఇంద్రారెడ్డికి కీలకమైన హోంశాఖను అప్పగించారు. అలాగే రోడ్లు భవనాల శాఖను గల్లా అరుణ కుమారి, సమాచార, పర్యాటక శాఖను జె.గీతారెడ్డికి, చిన్నతరహా పరిశ్రమల శాఖను డికె అరుణకు, చిన్నతరహా నీటిపారుదల శాఖను సునీతా లక్ష్మారెడ్డికి కేటాయించారు. మహిళా అభ్యర్థులు అని చిన్నచూపు చూడకుండా వీరికి కీలకమైన, ముఖ్య శాఖలు కేటాయించి వైఎస్ రాష్ట్ర మంత్రివర్గంలో మహిళలకు తగిన న్యాయం చేశారని పార్టీ నాయకులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
News Posted: 27 May, 2009
|