సహాయ మంత్రులకు భరోసా
న్యూఢిల్లీ : క్యాబినెట్ మంత్రికి, స్వతంత్రంగా బాధ్యతలు నిర్వర్తించే సహాయ మంత్రికి, మామూలు సహాయ మంత్రికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటని కొందరు ఎంపిలు సీనియర్లను అడుగుతుండడం బుధవారం న్యూఢిల్లీలో వినిపించింది. కాబోయే మంత్రులకు వేతనాలు, భత్యాల విషయమై సందేహాలు ఏవైనా ఉంటే వారేమీ కలత చెందనక్కర లేదు. భత్యాల విషయంలో క్యాబినెట్ మంత్రికి, తక్కిన రెండు కేటగరీలకు మధ్య అంతగా తేడా ఏమీ లేదు. కొన్నివ్యత్యాసాలు ఉంటాయి.కాని మూడు ర్యాంకుల మంత్రుల జీవన సరళులలో తేడాలు కొట్టవచ్చినట్లుగా కనిపించేంత మాత్రం కాదు.
అయితే, దేశంలో అత్యంత శక్తిమంతమైన గదిలోకి అడుగుపెట్టే విషయంలోనైతే ర్యాంకులు పరిగణనలోకి వస్తాయి. క్యాబినెట్ సమావేశాలకు ఆ హోదా గల మంత్రులు హాజరు కావచ్చు. స్వతంత్ర బాధ్యతలు నిర్వర్తించే సహాయ మంత్రి తన మంత్రిత్వశాఖకు సంబంధించిన ముఖ్యమైన చర్చ అజెండాలో ఉన్నప్పుడు మాత్రమే క్యాబినెట్ సమావేశాలకు హాజరు కావచ్చు.
సహాయ మంత్రి ఈ సమావేశాలకు హాజరు కాజాలరు. అంతేకాకుండా, జూనియర్ మంత్రి ఎప్పుడూ తన సీనియర్ ఎప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారోనని ఆందోళన చెందవలసి ఉంటుంది. వ్యక్తిగత సిబ్బంది ఎంపిక విషయంలో కూడా ఈ ర్యాంకుల మంత్రుల మధ్య వ్యత్యాసం ఉంది. క్యాబినెట్ మంత్రులు మాత్రమే ఒక ఐఎఎస్ అధికారిని పర్సనల్ సెక్రటరీగా నియమించుకోవచ్చు. అయితే, ఇది సంప్రదాయమా లేక నిబంధనా అనేది స్పష్టంగా తెలియరావడం లేదు.
ఇక 'ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ' (ఒఎస్ డి)లను నియమించుకునే హక్కు విషయంలో కూడా తేడా ఉంది. ఎవరైనా సహాయ మంత్రి ఒక ఒఎస్ డిని నియమించుకోవాలని పట్టుబట్టితే, ఆ మంత్రి తనకు కేటాయించే 13 మంది వ్యక్తిగత సిబ్బందిలో ఇద్దరిని వదులుకోవలసి ఉంటుంది. మూడు కేటగరీల మంత్రులు విదేశాలకు వెళ్ళాలంటే ప్రధాని అనుమతి తప్పనిసరి. విదేశీ పర్యటనలో మంత్రి తన జీవిత భాగస్వామిని వెంట తీసుకువెళ్ళవచ్చు.
మంత్రుల జీత భత్యాలు
నెలకు లక్ష రూపాయల జీతం. 9687 చదరపు అడుగుల బంగళా, ఆరేడుగురు సిబ్బంది క్వార్టర్స్.
సిబ్బంది: క్యాబినెట్ మంత్రికి 16 మంది, సహాయ మంత్రికి 13 మంది. పెట్రోల్ ఉచితం. ఢిల్లీలో ఉపయోగించుకునేందుకు ఒక కారు, స్వరాష్ట్రంలో ఉపయోగించుకునేందుకు ఒక కారు. మళ్ళీ పెట్రోల్ ఉచితం. ఇక ఏడాదికి 48 ఉచిత బిజినెస్ క్లాస్ విమాన ప్రయాణం టిక్కెట్లు. ఇంటిలో మూడు ఫోన్లు. వాటిలో ఒక ఫోన్ కు అపరిమితంగా ఐఎస్ డి, ఎస్ టిడి కాల్స్ సదుపాయం. రూ. 2.5 లక్షలు విలువ చేసే ఫర్నీచర్, విద్యుత్ పరికరాలు. మంత్రికి, కుటుంబానికి ఆసుపత్రిలో ఉచిత చికిత్స.
News Posted: 28 May, 2009
|