చల్లారని గుండె మంట
న్యూఢిల్లీ : ప్రభుత్వంలో స్థానం కల్పించని అర్జున్ సింగ్, హెచ్.ఆర్. భరద్వాజ్, శివరాజ్ పాటిల్ వంటి సీనియర్ సహచరులు కొందరికి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఓదార్పుగా ఫోన్ చేసి మాట్లాడారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ హుందాగా, మర్యాదగా వ్యవహరిస్తారనే పేరుకు తగినట్లుగానే ఆయన ఈ కాల్స్ చేశారు. అయితే, మంత్రివర్గంలో చోటు దక్కని వారిలో గుండె మంటలను ఇదేమీ చల్లార్చలేదు.
'తాను ఉద్వాసన పలికిన మంత్రులు అందరితో ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడి, గవర్నర్ పదవులలో లేదా ఇతర ప్రభుత్వ విభాగాలలో, టాస్క్ ఫోర్స్ లలో లేదా చివరకు పార్టీ యంత్రాంగంలో పదవులలో నియమించగలమని ప్రతి ఒక్కరికీ హామీ ఇచ్చారు' అని ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి.
అర్జున్ సింగ్, భరద్వాజ్, శివరాజ్ పాటిల్ వంటి పాతతరం నాయకులు తమ అసంతృప్తిని బాహాటంగా ప్రకటించలేదు. కాని, మరి కొందరు, ముఖ్యంగా గిరిజా వ్యాస్, శీశ్ రామ్ ఓలా, శ్రీకాంత్ జెనా, సల్మాన్ ఖుర్షీద్, బేణి ప్రసాద్ వర్మ వంటి నాయకులు తమ బాధను బయటపెట్టుకున్నారు. మొదటిసారి ఎంపి అయిన సి.పి. జోషికి తన బదులు మంత్రివర్గంలో చోటు దక్కడం గిరిజా వ్యాస్ అసంతుష్టికి కారణం. తన హోదా తగ్గించినందుకు జెనా నొచ్చుకున్నారు. ఆయన దేవేగౌడ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా వ్యవహరించారు. కాని ఇప్పుడు స్వతంత్ర బాధ్యతలేవీ లేకుండా సహాయ మంత్రిగా తీసుకున్నారు.
ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఎంపిల గుండె మంట చెప్పుకోదగిన స్థాయిలోనే ఉంది. 1984 తరువాత అధిక సంఖ్యలో 21 మంది కాంగ్రెస్ ఎంపిలను ఎన్నుకున్న రాష్ట్రం నుంచి ఒక్క క్యాబినెట్ మంత్రి కూడా లేరు. యుపి నుంచి ఎన్నికైన వారు మొదటిసారి ఎంపిలు అయినవారు కూడా కారు. సల్మాన్ ఖుర్షీద్ లోగడ పి.వి. నరసింహారావు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. బేణి ప్రసాద్ వర్మ యుపిలో ఏడుసార్లు ఎంఎల్ఎగా ఉన్నారు. ఆయన దేవేగౌడ ప్రభుత్వంల క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కాని ఈసారి ఆయనను అలక్ష్యం చేశారు. యుపికి తగినంత ప్రాతినిధ్యం కల్పించకపోవడమే కాకుండా హిందీ భాష మాట్లాడే ప్రధాన ప్రాంతం నుంచి కేంద్ర మంత్రివర్గంలో మైనారిటీ వర్గానికి చెందిన సభ్యుడు ఒక్కరిని కూడా మంత్రిగా ఎంపిక చేయకపోవడంపై ప్రశ్నలు వస్తున్నాయి.
'ఇది నిజంగా ఆశ్చర్యం కలిగిస్తున్నది. మైనారిటీలు హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీకి వోట్లు వేశారు. అయినప్పటికీ ఈ ప్రధాన ప్రాంతం నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఎవరికీ చోటు కల్పించలేదు' అని ముస్లిం ఎంపి ఒకరు పేర్కొన్నారు. మంత్రివర్గంలో ఇద్దరు ముస్లిం మంత్రులు ఉన్నారు. వారు గులామ్ నబీ అజాద్, డాక్టర్ ఫరూఖ్ అబ్దుల్లా. అయినా హిందీ భాషా ప్రాంతాలకు చెందిన ఎంపిలకు ఇది మింగుడుపడడం లేదు.
News Posted: 28 May, 2009
|