కీలక శాఖల కొరతతో నష్టం
హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్రంలో ప్రధాన మంత్రిత్వశాఖలు దక్కకపోవడం వల్ల రాష్ట్రంలో ప్రాజెక్టులకు నష్టదాయకం కావచ్చునని ప్రభుత్వ అధికారులు కలవరపడుతున్నారు. మౌలిక వసతులు, రోడ్లు, గ్రామీణాభివృద్ధి వంటి ప్రధాన రంగాలలో ప్రయోజనాలు ఒనగూరకపోవడమే కాకుండా, ఈ కీలక శాఖలను పొందిన మంత్రులు ఆంధ్ర ప్రదేశ్ ను కాదని తమ తమ రాష్ట్రాలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవచ్చునని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రంలో ఒక పెద్ద రేవు కోసం రూ. 8000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్ డిఐ)కి సంబంధించిన ఒక ప్రతిపాదనకు అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి. చిదంబరం నెలల తరబడి ఆమోదముద్ర వేయలేదని అధికార వర్గాలు తెలియజేశాయి. 'దేశం మాంద్యంతో సతమతం అవుతున్న సమయంలో భారీ పెట్టుబడి ప్రతిపాదనలకు అనుమతి మంజూరు చేయడంలో ఏ జాప్యమైనా ఉద్దేశపూర్వకంగా చేసినదే అవుతుంది' అని సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. చిదంబరం హోమ్ మంత్రిత్వశాఖకు మారిన తరువాత ఆ రేవు ప్రతిపాదనకు ఆమోద ముద్ర లభించింది.
News Posted: 29 May, 2009
|