రాజ్ భవన్ లో అర్జున్?
న్యూఢిల్లీ : కేంద్రంలో కొత్త మంత్రి మండలిలో చోటు దక్కని అర్జున్ సింగ్ వంటి నాయకుల భవితవ్యం ఇంకా అగమ్యగోచరంగానే ఉన్నది. అటువంటి నాయకులకు కేటాయించే కొత్త బాధ్యతలపై మీడియా అడిగిన ప్రశ్నలకు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నేరుగా సమాధానం ఇవ్వలేదు. 'ప్రజా జీవితంలో వారి నైపుణ్యాన్ని ఉపయోగించుకునేందుకు ఇతర మార్గాలు ఉన్నాయి' అని గురువారం రాష్ట్రపతి భవన్ లో 59 మంది మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానంతరం చెప్పారు. అయితే, ఆ నాయకులకు ఎప్పుడు, ఎక్కడ, ఏవిధంగా వేరే బాధ్యతలు అప్పగిస్తారనేదే ప్రశ్న.
పూర్వపు మంత్రివర్గంలో మంత్రులైన అర్జున్ సింగ్, శివరాజ్ పాటిల్, హెచ్.ఆర్. భరద్వాజ్, సైఫుద్దీన్ సోజ్ లను కొత్త మంత్రివర్గంలో చేర్చుకోలేదు. కొన్ని రాజ్ భవన్ లలో త్వరలో ఖాళీలు ఏర్పడినప్పుడు వారిలో కొందరిని గవర్నర్లుగా నియమించవచ్చుని అభిజ్ఞ వర్గాలు సూచించాయి. ఉత్తర ప్రదేశ్ నుంచి ఎవరినీ క్యాబినెట్ మంత్రిగా ఎందుకు నియమించలేదనే ప్రశ్నకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధి 'ఎంఒఎస్ (సహాయ మంత్రి) కాఫీ నహీ హై (ఎంఒఎస్ సరిపోదా)? స్వతంత్ర బాధ్యతతో ఇద్దరు ఎంఒఎస్ లు ఉన్నారు' అని సమాధానం ఇచ్చారు. ఆ రాష్ట్రంలోని 80 స్థానాలలో కాంగ్రెస్ పార్టీకి 21 స్థానాలు మాత్రమే వచ్చిన సంగతిని సోనియా గుర్తు చేశారు.
ఉత్తర ప్రదేశ్ కు ఐదుగురు మంత్రులు ఉన్నారు. వారిలో ఇద్దరు స్వతంత్ర బాధ్యతలు గల సహాయ మంత్రులు - శ్రీప్రకాశ్ జైస్వాల్, సల్మాన్ ఖుర్షీద్, ముగ్గురు సహాయ మంత్రులు - జితిన్ ప్రసాద, ఆర్.పి.ఎన్. సింగ్, ప్రదీప్ జైన్. రాష్ట్రం నుంచి క్యాబినెట్ మంత్రి ఎవరూ లేరు. ఆ ఐదుగురికీ ముఖ్యమైన శాఖలనే కేటాయించారు. జైస్వాల్ కు బొగ్గు, కార్యక్రమాల అమలు, స్టాటిస్టిక్స్ మంత్రిత్వశాఖ లభించగా ఖుర్షీద్ కార్పొరేట్ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నిర్వహిస్తారు. జితిన్ ప్రసాద పెట్రోలియం, సహజ వాయువుల శాఖలోను, ఆర్.పి.ఎన్. సింగ్ రోడ్డు రవాణా, రహదారుల శాఖలోను, ప్రదీప్ జైన్ గ్రామీణాభివృద్ధి శాఖలోను బాధ్యతలు నిర్వహిస్తారు. హిందీ భాషా ప్రాంతాలలో పార్టీ పునరుజ్జీవనం ద్వారా సొంతంగా అధికారంలోకి రావాలన్న కాంగ్రెస్ వ్యూహానికి యుపి కీలకం.
News Posted: 30 May, 2009
|