బాబు అనుకూలురకు బదలీలు
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికలకు ముందు, తరువాత తెలుగు దేశం పార్టీ (టిడిపి) పట్ల, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పట్ల సానుకూలత వ్యక్తం చేసిన రెండు డజన్ల మంది ఐఎఎస్, ఐపిఎస్ అధికారులను అంతగా ప్రాముఖ్యం లేని పదవులలోకి బదలీ చేయాలని ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి యోచిస్తున్నారు.
కొత్త శాసనసభ తొలి సమావేశాలు ముగిసిన తరువాత, జూన్ చివరి వారంలో జిల్లా కలెక్టర్లు, పోలీస్ సూపరింటెండెంట్ల (ఎస్ పిల) వార్షిక సమావేశానికి ముందు పెద్ద ఎత్తున చేపట్టే ఐఎఎస్, ఐపిఎస్ అధికారుల బదలీల ప్రక్రియలో భాగంగా ఈ బదలీలు జరుగుతాయి. స్థానిక కాంగ్రెస్ నాయకులతో సరి పడని, పార్టీ కార్యకర్తలు ఫిర్యాదులు చేసిన కొందరు జిల్లా కలెక్టర్లు, ఎస్ పిలకు కూడా ముఖ్యమంత్రి స్థాన చలనం కలిగించవచ్చు. ఎన్నికల సమయంలో ప్రధాన ప్రతిపక్షం పట్ల ఈ అధికారులు పక్షపాతంతో వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చాయి.
భారీ స్థాయిలో బదలీలు లేదా మార్పులు చేర్పులు జరగవచ్చుని ఊహిస్తూ పలువురు సీనియర్ అధికారులు తమ అర్హతల గురించి తెలియజేసేందుకై ముఖ్యమంత్రి సలహాదారుడు డాక్టర్ కె.వి.పి. రామచంద్రరావును కలుసుకోవడానికి సచివాలయంలో అధికార కేంద్రమైన 'డి' బ్లాక్ ను తరచు సందర్శిస్తున్నారు. తమను ప్రస్తుత పదవులలోనే కొనసాగనివ్వాలని కొందరు అధికారులు ప్రాథేయపడుతుండగా, మెరుగైన పోస్టింగ్ ల కోసం ఇతరులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ మార్పులు చేర్పులలో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పునర్వ్యవస్థీకరణ కూడా జరగవచ్చునని అధికార వర్గాలు సూచిస్తున్నాయి. కొత్త ఎగ్జిక్యూటివ్ అధికారి (ఇఒ)ను కూడా నియమిస్తారు.
జెరూసలెంకు ఐదు రోజుల యాత్రకై వెళ్ళిన డాక్టర్ రాజశేఖరరెడ్డి తిరిగి వచ్చే లోగానే అధికారుల జాబితాకు తుదిరూపం ఇవ్వవలసిందిగా డాక్టర్ రామచంద్రరావును కోరారు. డాక్టర్ రాజశేఖరరెడ్డి జూన్ 1న తిరిగి అధికార విధులకు హాజరవుతారని, ఆతరువాత ఈ జాబితాను ఖరారు చేయగలరని ఆ వర్గాలు తెలియజేశాయి.
News Posted: 31 May, 2009
|