చిరు పార్టీలో బాబు భయం
హైదరాబాద్ : ప్రధాన రాజకీయపక్షాలను దెబ్బకొట్టి పీఠం ఎక్కుదామనుకున్న ప్రజారాజ్యం పార్టీకి ఇప్పుడు దెబ్బకాసుకోవడం పెద్ద పనైపోయింది. అధికారాన్ని అందుకున్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి ముప్పు లేకపోయినా, అధికారాన్ని ఆమడ దూరంలో నిలిచిపోయిన తెలుగుదేశం పార్టీని చూసి ప్రజారాజ్యం కలవరపడుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో చాణక్యనీతిని, టక్కుటమార విద్యలను ప్రదర్శించే చంద్రబాబునాయుడు ఎత్తుగడలను గమనించి బెంబేలవుతోంది. ప్రస్తుతం ప్రజారాజ్యానికి కీలకనేతలుగా ఉన్న తెలుగుదేశం మాజీ నాయకులు జారిపోకుండా అధినేత చిరంజీవి, ఆయన బావమరిది అల్లు అరవింద్ హడావిడిగా రక్షణ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కాంగ్రెస్ ను వదిలేసి ప్రజారాజ్యం పార్టీని లక్ష్యంగా చేసుకోవడం దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించేనన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.
ప్రజారాజ్యానికి వెన్నుముకగా ఉన్న మాజీ సహచరులను తిరిగి ఆహ్వానించడం ద్వారా ఆ పార్టీ నడ్డి విరగొట్టాలన్నది చంద్రబాబు ఎత్తుగడగా చెబుతున్నారు. రాబోయే ఐదేళ్ళలోపు ప్రజారాజ్యాన్ని ఉనికిలో లేకుండా చేస్తే మళ్ళీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో ముఖాముఖి తలపడే అవకాశాన్ని పొందడం ద్వారా లాభపడాలనే వ్యూహం. ముక్కోణపు పోటీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం తథ్యమని అలా జరిగినంత కాలం కాంగ్రెస్ ను ఓడించడం కష్టమనేది చంద్రబాబునాయుడు కొత్తగా నమ్ముతున్న రాజకీయ సిద్ధాంతం. కాబట్టి తన మాజీ సహచరులు కోటగిరి విద్యాధరరావు, కొత్తపల్లి సుబ్బారాయుడు, భూమా దంపతులు, కళావెంకట్రావు, రామచంద్రయ్య, గంటా శ్రీనివాసరావు, దేవేందర్ గౌడ్ లాంటి హేమాహేమీలను ఆకర్షించడానికి చంద్రబాబునాయుడు ప్రయత్నాలు చేస్తున్నారన్న కథనాలు చిరంజీవిని దిగ్ర్భాంతికి గురి చేస్తున్నాయని వినికిడి. అందువలనే తిరుపతి నుంచి తిరిగి వచ్చిన వెంటనే చిరంజీవి ముఖ్య నేతలతో భేటీ జరిపారు. అంతకు ముందురోజే మాజీ తెలుగుదేశం తాజా ప్రజారాజ్యం నాయకులకు అరవింద్ విందు ఇచ్చారు.
Pages: 1 -2- News Posted: 1 June, 2009
|