సిబ్బందికి వైఎస్ మంత్రం
హైదరాబాద్ : ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి బుధవారం ప్రభుత్వోద్యోగులకు ఐదు సూత్రాల మంత్రాన్ని సూచించారు. దానిని తు.చ. తప్పకుండా పాటించాలని వారికి ఆయన సలహా ఇచ్చారు. పారదర్శకత, సామర్థ్యం, జవాబుదారీతనం, బాధ్యత, పథకాల ఫలితాలను సమర్థంగా ప్రజలకు అందజేయడం అనేది తన ప్రభుత్వ ఐదు అంశాల మంత్రం కావాలని ముఖ్యమంత్రి అన్నారు.
బుధవారం ఉదయం దాదాపు 7.15 గంటలకు సి బ్లాక్ లో తన చాంబర్స్ లోకి తాను లాంఛనంగా ప్రవేశించినప్పుడు తనకు ఎర్ర తివాచి పరచి స్వాగతం పలికిన సచివాలయం ఉద్యోగులను ఉద్దేశించి డాక్టర్ రాజశేఖరరెడ్డి ప్రసంగిస్తూ, ప్రజలు రాజకీయంగా విజ్ఞులయ్యారని, వారు ఫలితాలను కోరుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సాధ్యమైనంత త్వరలో వారికి అందాలని, వారు సాకులు ఒప్పుకోరని ఆయన అన్నారు. ఆలస్యాన్ని, సోమరితనాన్నిజనం సహించరోని చెబుతూ, దళారులను, ఆశ్రిత పక్షపాతాన్ని, అవినీతిని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆశలకు తగినట్లుగా పనులు జరగకపోతే వారు ఆగ్రహం చెందగలరని డాక్టర్ రాజశేఖరరెడ్డి అన్నారు.
పథకాలు, కార్యక్రమాల అమలుకు ఉద్యోగులు సహకారాన్ని అందజేయాలని డాక్టర్ రాజశేఖరరెడ్డి కోరుతూ, ప్రాజెక్టులు పూర్తి చేయడానికి, కార్యక్రమాలను అమలు పరచడానికి, ప్రజల సమస్యలు తీర్చడానికి తన ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వగలదని తెలియజేశారు. వ్యవస్థలో లోపాలను సరిదిద్దాలని ఆయన అధికారులను, సిబ్బందిని కోరారు.
Pages: 1 -2- News Posted: 4 June, 2009
|