మీరాకు కోపం వస్తుంది
న్యూఢిల్లీ : మీరా కుమార్ కు కోపం వస్తుంది. కాని ఆమె ఎన్నడూ విలపించరు. భారతదేశపు తొలి మహిళా స్పీకర్ మీరా సన్నటి స్వరం ఆమెకు ముందు స్పీకర్ గా ఉన్న సోమనాథ చటర్జీ స్వరంతో పోలిస్తే పీల స్వరంలా అనిపించవచ్చు. కాని బుధవారం స్పీకర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు తాను కఠినచిత్తురాలుగా కూడా ఉండగలనని ఆమె సూచించారు.
ఒక మహిళలా మీ తత్వమేమిటనే ప్రశ్నకు 64 సంవత్సరాల మీరా సమాధానంగా ఎదురు ప్రశ్న వేశారు. 'మీరు వ్యక్తిగత ప్రశ్నలు అడుగుతున్నారా' అని ఆమె ప్రశ్నించారు. 'ఇతరుల మాదిరిగా నాకూ కోపం వస్తుంది. కాని నేను ఏడవను' అని ఆమె చెప్పారు. సభలో అలజడి సృష్టించే సభ్యులు ఈ సంగతి గ్రహించాలి. స్పీకర్ పదవీ బాధ్యతల నిర్వహణలో ఆమె తొలి రోజు సభ్యులు హుందాగానే ప్రవర్తించారు. ఆమెను వారు అభినందించి, తమ సహకారం అందజేస్తామని హామీ ఇచ్చారు.
స్పీకర్ కు వామపక్షాల మద్దతును ప్రకటించడానికి లేచి నిలబడిన తొమ్మిదిసార్లు సిపిఎం ఎంపి బాసుదేవ్ ఆచార్య దాదాపు 30 సంవత్సరాల అలవాటును వదలుకోలేకపోయారు. వెనుక స్థానాలలో కూర్చున్న సభ్యులు సరిదిద్దేంత వరకు కూడా ఆయన మీరాను 'సార్' అనే సంబోధిస్తూనే ఉన్నారు. తరువాత ఆయన ఆమెను 'మేడమ్' అని సంబోధించారు.
మాజీ దౌత్యవేత్త అయిన మీరా కుమార్ పేదరికం, దోపిడీ, తరం మార్పు వంటి వివిధ అంశాలపై మాట్లాడారు. కాని ఏకాభిప్రాయ రాజకీయాల ఆవశ్యకత గురించి ఆమె నొక్కి చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టడానికి సిద్ధాంతాలకు అతీతంగా, పక్షపాతానికి తావు లేకుండా వ్యవహరిస్తానని ఆమె వాగ్దానం చేశారు.
'మనతో ఏకీభవించని వారి పట్ల ప్రేమతో, గౌరవంతో వ్యవహరించడంలోనే ప్రజాస్వామ్యానికి అర్థం ఇమిడి ఉంది' అని పండిత్ నెహ్రూను ఉటంకిస్తూ మీరా అన్నారు. ఆ మాటలు ఎన్నికల్లో దెబ్బతిన్న ప్రతిపక్షానికి ఉపశమనం కలిగించగా ఆతరువాత వాటికి మరింత భరోసా ఇచ్చే వాక్యాలు ఆమె నోటి వెంట వచ్చాయి. ఇండియా వంటి దేశంలో సత్పరిపాలన ప్రతి సభ్యుని నుంచి నిర్మాణాత్మక సహకారం లేకుండా సాధ్యం కాదని అధికార పక్షాన్ని హెచ్చరించారు.
లోక్ సభలో స్పీకర్ పదవిని స్వీకరిస్తూ చేసిన ప్రసంగంలోను, ఆతరువాత స్పీకర్ గా తొలి విలేఖరుల గోష్ఠిలో చేసిన ప్రసంగంలోను ఆమె రాజకీయ ఔచిత్యాన్ని, హుందాతనాన్ని ప్రదర్శించారు. లోక్ సభ తొలి స్పీకర్ జి.వి. మావలంకర్ నుంచి సోమనాథ్ చటర్జీ వరకు స్పీకర్ పదవిని అధిష్ఠించిన వారి విశిష్టత గురించి ఆమె మాట్లాడి ఈ పదవిని తానెంతో వినమ్రంగా స్వీకరిస్తున్నానని చెప్పారు.
Pages: 1 -2- News Posted: 4 June, 2009
|