పిఎంకు మహిళ రక్షణ
న్యూఢిల్లీ : తొలి మహిళా రాష్ట్రపతి, తొలి మహిళా స్పీకర్. ఇప్పుడు ప్రధానికి రక్షణ కల్పించేందుకు తొలి మహిళా ఆఫీసర్ నియామకం. ప్రధాని భద్రత విషయాలు చూసే ప్రత్యేక రక్షణ దళం (ఎస్ పిజి)లో తొలి మహిళా అధికారిగా ఐపిఎస్ ఆఫీసర్ బినీతా ఠాకూర్ ను నియమించే అవకాశం ఉంది.
ఆమె ఇంతకుముందు నిర్వహించిన బాధ్యతలకు ఇది పూర్తిగా భిన్నమైనది. కాని రాజస్థాన్ కేడర్ కు చెందిన 1996 ఐపిఎస్ బ్యాచ్ అధికారి బినీతకు ఈ కొత్త బాధ్యత ప్రత్యేకమైనదని తెలుసు. ఆమె ఇంతకుముందు మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారాన్ని అరికట్టడం, బందిపోట్లను అణచివేయడం, హింసాత్మకంగా సాగే రైతుల నిరసనలను నియంత్రించడం వంటి బాధ్యతలను నిర్వర్తించారు.
'నాకెంతో సంతోషంగా ఉంది. అయితే, నా సీనియర్ల నుంచి లాంఛనంగా పత్రం అందుకోనిదే నేనేమీ వ్యాఖ్యానించజాలను' 30 దశకంలో ఉన్న బినీతా ఠాకూర్ గురువారం చెప్పారు. అధికారపూర్వక వర్తమానం కనుక జూన్ 6న అందితే అది ఆమెకు జన్మదన కానుక కాగలదు.
మన్మోహన్ సింగ్ కు, ఆయన కుటుంబానికి, మాజీ ప్రధానులకు భద్రత కల్పించే ఎస్ పిజిలో ఠాకూర్ పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్ పి)గా చేరతారు. ఎస్ పిజిలోని ఒక బృందానికి ఆమె సారథ్యం వహిస్తారు. ప్రధాని ప్రయాణాలు చేసినప్పుడు పలు భద్రతా వలయాలలో ఒకటైన 'ఔటర్' వలయంలో ఆమె భాగం కాగలరని అధికార వర్గాలు తెలియజేశాయి.
Pages: 1 -2- News Posted: 5 June, 2009
|