కార్లకు డే ఆఫ్?
ముంబై : వారానికి ఒక రోజు కార్లను రోడ్లపైకి తీసుకురాకుండా ఎందుకు చూడరని బొంబాయి హైకోర్టు ప్రశ్నించింది. వాహనాల వల్ల కాలుష్యాన్ని అరికట్టడానికి, ట్రాఫిక్ సాఫీగా సాగేట్లు చూడడానికి చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తూ దాఖలైన ఒక ప్రజా ప్రయోజక వ్యాజ్యం (పిఐఎల్ - పిల్)ను కోర్టు విచారిస్తూ, కార్ల రిజిస్ట్రేషన్ నంబర్లలో చివరి అంకె ఆధారంగా వారానికి ఒక రోజు కార్లు రోడ్లపైకి రాకుండా నిరోధించడం సాధ్యమేమో పరిశీలించవలసిందిగా గ్రేటర్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ కు సూచించింది.
'మీరు ప్రయత్నించవలసి ఉంటుంది' అని జస్టిస్ బిలాల్ నజ్కీ సూచించారు. ముంబైలో వాహనాల రద్దీని తగ్గించేందుకు మార్గాలు సూచించేందుకై మహారాష్ట్ర ప్రభుత్వం 2000లో నియమించిన వి.ఎం. లాల్ కమిటీ చేసిన సూచనను సమర్థిస్తూ జస్టిస్ నజ్కీ ఈ అభిప్రాయం వెలిబుచ్చారు. 'చౌక కార్లు రంగ ప్రవేశం చేస్తుండడంతో మన రోడ్లపై మరిన్ని కార్లు నడుస్తాయి. ఈ ప్రయోగం ఎందుకు జరపకూడదు' అని న్యాయమూర్తి అడిగారు. కార్పొరేషన్ ఏదైనా ప్రధాన రోడ్డుపై ఈ సూచనను ప్రయోగాత్మకంగా అమలు జరవపవచ్చునని ఆయన సూచించారు. ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా వాదించిన మునిసిపల్ కార్పొరేషన్ సమాధానం దాఖలు చేసేందుకు తనకు రెండు వారాలు వ్యవధి ఇవ్వవలసిందిగా కోర్టును కోరింది. ప్రపంచంలో అత్యంత చౌక అయిన కారు నానో వచ్చే నెల రోడ్లపైకి రానున్నందున ఈ 'ప్రయోగాన్ని' అమలు జరపాలని అనుకోవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా బీజింగ్, షాంఘై, జకార్తా, పోర్ట్ లాండ్, యోకొహామా వంటి నగరాలు 'కార్ల రహిత' దినాల ప్రతిపాదనను ప్రయోగాత్మకంగా అమలు జరిపాయి. బీజింగ్ క్రితం సంవత్సరం ఒలింపిక్స్ సమయంలో 'కార్ల రహిత' దినాల విధానాన్ని ప్రవేశపెట్టింది. రోడ్లపై పొగ కాలుష్యాన్ని తగ్గించడానికి, ట్రాఫిక్ సాఫీగా సాగిపోయేట్లు చూడడానికి గత అక్టోబర్ లో తిరిగి కొన్ని ఆంక్షలను బీజింగ్ విధించింది. లైసెన్స్ నంబర్లలో చివరి అంకెను బట్టి కార్లను ఐదు గ్రూపులుగా విభజించారు. ఒక్కొక్క గ్రూపును వారంలో ఒక రోజు నిషేధించారు. వారాంతాలలో ఏ నిషేధమూ లేదు. కొత్త ఆంక్షలు ప్రభుత్వ వాహనాలు, కార్పొరేట్ కార్లకు వర్తించాయి. ఈ నిషేధం ప్రైవేట్ కార్లకు 15 గంటల పాటు, ప్రభుత్వ, కార్పొరేట్ కార్లకు రోజంతా వర్తిస్తుంది. అయితే, ఒక ప్రోత్సాహకంగా, ఈ ఆంక్షలకు గురైన వాహనాలకు ఒక నెల పాటు వాహనాల పన్నును, ఒక సంవత్సరం పాటు రోడ్ల నిర్వహణ ఫీజును చెల్లించకుండా మినహాయింపు ఇచ్చారు.
కోలకతాలో సుబ్రతా ముఖర్జీ మేయర్ గా ఉన్నప్పుడు సరి అంకెలు ఉన్న కార్లను కొన్ని రోజుల్లోను, బేసి అంకెలు ఉన్న కార్లను వేరే రోజుల్లోను రోడ్లపైకి అనుమతించాలనే ఆలోచన చేశారు. కాని డేటాబేస్ ను కంప్యూటర్ లో పొందుపరచనందున ఆ ప్లాన్ అసలు ఆచరణలోకి రాలేదు.
Pages: 1 -2- News Posted: 11 June, 2009
|