ప్లాన్ తోనే వైఎస్ దాడి?
హైదరాబాద్ : ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాత్తుగా తెరాసపైన, దాని అధినేత కెసిఆర్ పైన వ్యూహాత్మకంగానే ధ్వజమెత్తారా? తెరాసలో ఒక పక్క అసమ్మతి సెగలు కక్కుతున్న నేపధ్యంలో అదును చూసుకునే మరింత ఆత్మ రక్షణలో పడేసేందుకే వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నారా? అన్న ప్రశ్నలకు రాజకీయ పరిశీలకులు అవుననే అంటున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగ పోటీ చేసినా అత్యధిక స్థానాలను గెలుచుకుంది. దీంతో తెలంగాణ అంశంలో వైఎస్ వాదన నిజమేనన్న అభిప్రాయం అధిష్ఠానానికి కూడా కలిగింది. పైగా తెలంగాణ అంశంలో వైఎస్ వాదనకు అధిష్ఠానం మొదటి నుంచి పూర్తి అండగా ఉంది. ఈ పరిస్థితిలో శాసనసభలో తెలంగాణపై తన అభిప్రాయాన్ని మరోసారి చెప్పేఅవకాశం వైఎస్ కు లభించింది.
శత్రువు బలహీనంగా ఉన్నప్పుడే దెబ్బ తీయాలన్న సూత్రాన్ని వైఎస్ అమలు చేసినట్లు తోస్తోంది. సొంత పార్టీలోనే అసమ్మతితో కెసిఆర్ సతమతమవుతున్నారు. తనకు నమ్మకస్తులనుకున్న వారే ఎదురు తిరగడం, గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ కార్యాలయంలోనే విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి కెసిఆర్ పై ధ్వజమెత్తడం ఆయన ఊహించని పరిణామం. తెరాస రాజకీయంగానూ, నైతికంగానూ బలహీన పడిన తరుణంలో వైఎస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో వివిధ సందర్భాల్లో కెసిఆర్ కెసిఆర్ చేసిన ప్రకటనలను ఉటంకిస్తూ తాను తెరాసపైన, కెసిఆర్ పైనా ధ్వజమెత్తడంలో తప్పులేదన్న అభిప్రాయాన్ని కలిగించే ప్రయత్నం చేశారు. నిన్న తెరాస కార్యాలయంలో కెసిఆర్ సమీక్షా సమావేశాలు ప్రారంభం కావడం, మరోపక్క అసమ్మతి నాయకులు తెలంగాణ విమోచన సమితి పేరిట విడిగా సమావేశమైన నేపధ్యంలో శాసనసభలో ముఖ్యమంత్రి వైఎస్ తెరాసపై, కెసిఆర్ పైన విరుచుకుపడటం గమనార్హం.
Pages: 1 -2- News Posted: 11 June, 2009
|