బ్లాక్ విడో నేత స్త్రీల మోజు
గౌహతి : భయంకరమైన బ్లాక్ విడో ఉరఫ్ దిమా హలం దావొగాహ్ లేదా డిహెచ్ డి (జ్యుయెల్) గ్రూప్ అధిపతి, జ్యుయెల్ గార్లొస్సాగా అందరికీ పరిచితుడైన మిహిర్ బర్మన్ (36) అసోంలోని ఉత్తర కచార్ (ఎన్ సి) హిల్స్ జిల్లాలో కంపెనీలు, వ్యక్తులను తమ సంస్థ బెదరించి వసూలు చేసిన కోట్లాది రూపాయల సొమ్ములో కొంత భాగాన్ని ప్రతి నెల ఫేషియల్స్, మసాజ్ లు, కోలోన్లపై ఖర్చు చేసేవాడు. అతను మహిళలపై చేసే ఖర్చుకు ఇది అదనం.
గార్లొస్సాను అసోం పోలీసులు ఇటీవల బెంగళూరులో అరెస్టు చేశారు. ఆతరువాత అతను వారిని తన స్నేహితుడు, హెచ్ఎస్ బిసి ఉద్యోగి సమీర్ అహ్మద్ బన్నెరుఘట్ట రోడ్డులో అద్దెకు తీసుకున్న అపార్ట్ మెంట్ కు తీసుకువెళ్ళాడు. పోలీసులు ఆ అపార్ట్ మెంట్ లో నుంచి అహ్మద్ ను, మరొక డిహెచ్ డి తీవ్రవాది అష్రింగ్ దా వారిసాను అరెస్టు చేశారు. 'అతను విలాసవంతమైన జీవితం సాగించాడు' అని అసోం పోలీస్ డైరెక్టర్ జనరల్ (డిజిపి) జి.ఎం. శ్రీవాత్సవ తెలియజేశారు. 'అతను కాస్మెటిక్స్, మసాజులపై నెలకు సగటున రూ. 60 వేలు ఖర్చు చేస్తుంటాడు' అని ఆయన తెలిపారు.
తన క్షేత్ర కార్యకర్తలు బెదరించి వసూలు చేసే డబ్బులో అధిక మొత్తాన్ని గార్లొస్సా మహిళలపై ఖర్చు పెట్టేవాడు. అతను ఒక నాగా మహిళ కోసం తన దిమాసా భార్యను చంపి, తరువాత ఖాట్మండులో ఒక నేపాలీస్ సంఘ సేవిక ప్రేమలో పడ్డాడు. 'దెబుజిత్ సిన్హా పేరు మీద నకిలీ పాస్ పోర్టు సంపాదించడానికై అతను దాదాపు రెండు నెలలుగా బెంగళూరులో ఉంటున్నాడు. అతను ఆ పేరు మీద పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ పొందాడు' అని శ్రీవాత్సవ చెప్పారు. గార్లొస్సా కొంత కాలం నేపాల్ ను తన స్థావరంగా ఉపయోగించుకుని, బీర్ బహదూర్ చేత్రి పేరు మీద నేపాలీస్ పాస్ పోర్ట్ సంపాదించాడని ఆయన తెలిపారు.
గార్లొస్సా ఖాట్మండులో ఒకటి, నేపాల్ - ఉత్తర ప్రదేశ్ సరిహద్దులో భైరవ పట్టణంలో మరొకటి అలా రెండు విలాసవంతమైన ఇళ్ళను కూడా కొనుగోలు చేశాడు. పోలీసులు ఆ నేపాలీ మహిళ పేరు వెల్లడికి నిరాకరించారు. ఆమెను పట్టుకోవడానికి 'దౌత్య స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి' అని వారు ఇందుకు కారణంగా పేర్కొన్నారు. 'ఒక సోదరునిలా భావించే డిహెచ్ డి కమాండర్-ఇన్-చీఫ్ నిరంజన్ హొజాయితో సహా ఆ సంస్థ తిరుగుబాటువాదులకు వసతి ఏర్పాటు వంటి సహాయాన్ని ఆమె చేస్తున్నది' అని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలియజేశారు.
Pages: 1 -2- News Posted: 11 June, 2009
|