'గ్రామీణ' సేవలో సిఎలు
న్యూఢిల్లీ : చార్టర్డ్ అకౌంటెంట్ (సిఎ)ల సేవలు త్వరలో మరింత విస్తృతం కానున్నాయి. ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) ప్రధాన పథకం 'జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమం' (ఎన్ఆర్ఇజిపి) నిర్వహణ బాధ్యతలు చూసే సర్పంచ్ లు, బ్లాక్ డెవలప్ మెంట్ అధికారి (బిడిఒ)లు, ఇతర అధికారులు వ్యయం చేసే నిధులపై ఆడిట్ కు సిఎలను నియోగించాలనే ప్రతిపాదనను ప్రభుత్వ పరిశీలిస్తున్నది.
ఇందు నిమిత్తం ప్రొఫెషనల్స్ ను నియోగించడానికి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) సేవలు ఉపయోగించుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ విషయమై మాట్లాడడానికి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ అధికారులు నిరాకరించారు. అయితే, ఐసిఎఐ ఉపాధ్యక్షుడు అమర్ జిత్ చోప్రా ఈ విషయమై ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. కాని ఇతర వివరాల వెల్లడికి నిరాకరించారు.
ఈ పథకానికి క్రితం సంవత్సరం రూ. 30 వేల కోట్లు కేటాయించినందున, వేతనాలు ఆలస్యంగా చెల్లించడం, గ్రామస్థుల కోసం ఉద్దేశించిన పనిని కాంట్రాక్టర్లకు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడం, లీకేజీలు వంటి సమస్యల వల్ల ఈ పథకం సరిగ్గా అమలు జరగడం లేదని ప్రభుత్వ శాఖల పరిశీలనతో సహా పలు అధ్యయనాలలో వెల్లడైనందున ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తున్నది. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాలలో ప్రతి పేద కుటుంబానికి ఏటా 100 రోజుల పని కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రామీణ పేదల కోసం ఉద్దేశించిన నిధులు దారి మళ్ళకుండా సద్వినియోగమయ్యేట్లు చూడాలని ప్రభుత్వం కోరుకుంటున్నది.
Pages: 1 -2- News Posted: 11 June, 2009
|