టార్గెట్ తెరాస!
హైదరాబాద్ : రాబోయే రోజుల్లో తెరాస పైన, ఆ పార్టీ అధినేత కెసిఆర్ పైనే కాంగ్రెస్ గురిపెట్టనుంది. తెరాస, కెసిఆర్ లను లక్ష్యంగా చేసుకుని బుధవారం శాసనసభలోముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి దాడి చేసిన బాటలోనే మంత్రులు, కాంగ్రెస్ నాయకులు ఇక మీదట పయనించనున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని, తెలంగాణను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్న వారికే తాము వ్యతిరేకమని విస్తృత స్థాయిలో తెలంగాణ మంత్రులు ప్రచారం చేస్తున్నారు. వైఎస్ ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంమలో తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు బుధవారం శాసనసభలో ముఖ్యమంత్రి చేసిన ప్రసంగానికి అభినందనలు తెలియజేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు తమతమ జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి తెరాసకు, కెసిఆర్ కు వ్యతిరేకంగా భారీ ఎత్తున ప్రచారం చేయడంతో పాటు సంస్థాగతంగా పార్టీని మరింత పటిష్టం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
తెలంగాణపై తెరాసకు, కెసిఆర్ కు మాత్రమే హక్కు ఉందన్న చందంగా వ్యవహరిస్తున్నారని, తెలంగాణ ప్రజలు తెరాసకన్నా కాంగ్రెస్ నే ఎక్కువ ఆదరించారని, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు అండగా ఉన్నారని ఇటీవల జరిగిన ఎన్నికల్లో స్పష్టమైందని తెలంగాణ మంత్రులు వైఎస్ కు వివరించారు. తెలంగాణ సెంటిమెంట్ ఉన్నంత మాత్రాన అభివృద్ది తమకు అవసరం లేదని తెలంగాణ ప్రజలు అనడం లేదని, వారు అభివృద్ధిని కూడా కోరుకుంటున్నారని సమావేశంలో అభిప్రాయపడ్డారు.
ఇక మీదట తెరాస, కెసిఆర్ ల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందేనని తెలంగాణ మంత్రులు ముక్త కంఠంతో సమావేశంలో అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి శాసనసభలో చేసిన ప్రసంగాన్ని తెరాస నాయకులు వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి తెలంగాణకు వ్యతిరేకమన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించేందుకు వారు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. కాంగ్రెస్ నాయకులపైన, కోస్తా, రాయలసీమ ప్రాంతాల వారిపైన కెసిఆర్ వ్యక్తిగతంగా చేసిన ఆరోపణలను, విమర్శలను ఖండిస్తే తెలంగాణకు వ్యతిరేకం ఎలా అవుతుందని వారు చర్చించుకున్నారు. ఇలాఉండగా, త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన మంత్రులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్షాలైన తెలుగుదేశం, తెరాసలను ప్రజలు తిరస్కరించడాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేస్తూ గ్రేటర్ ఎన్నికల్లో అదే హవా కొనసాగించాలన్నారు.
Pages: 1 -2- News Posted: 12 June, 2009
|