బెంగళూరులో బళ్లారి ప్రతిధ్వని
బెంగళూరు : కర్నాటకలో బళ్లారి రాజకీయ కార్యకలాపాలకు అంతగా పేరొందిన ప్రాంతం కాదు. కాని డబ్బుకు లోటు లేని ఈ గని ప్రాంతంలో వినవచ్చే ఏ నిరసనలైనా రాష్ట్ర రాజధాని బెంగళూరులో ప్రతిధ్వనిస్తుంటాయి. ఇప్పుడు ఈ ధ్వనులు బిగ్గరగా వినిపిస్తున్నాయి. బెంగళూరుకు ఉత్తరంగా 350 కిలో మీటర్ల దూరంలో ఉన్న బళ్లారిలో పలుకుబడి విశేషంగా ఉన్న శక్తిమంతులైన రెడ్డి సోదరులు రాష్ట్ర ముఖ్యమంత్రి బి.ఎస్. యెడ్యూరప్పతో పోరు సాగిస్తున్నారు. 2008 శాసనసభ ఎన్నికలలో యెడ్యూరప్ప అధికారంలోకి రావడానికి రెడ్డి సోదరులు చాలా సాయం చేశారు.
గనుల వాణిజ్యవేత్తలైన సోదరులు గాలి కరుణాకరరెడ్డి, జనార్దనరెడ్డి, సోమశేఖరరెడ్డి ముఖ్యమంత్రి యెడ్యూరప్ప వ్యవహార శైలి గిట్టని శాసనసభ్యులు, మంత్రుల బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. వారిలో కొందరు ముఖ్యమంత్రిని 'నిరంకుశుడి'గా అభివర్ణిస్తున్నారు.
ముఖ్యమంత్రి వ్యవహార శైలిని నిరసిస్తున్న నాయకులను సముదాయించడానికై భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు అరుణ్ జైట్లీ గురువారం హుటాహుటిని బెంగళూరు చేరుకున్నారు. 'అసమ్మతి ఏమీ లేదు. ఉన్నవి కొద్దిపాటి భేదాభిప్రాయాలు మాత్రమే. నేను పలువురు నాయకులను కలుసుకుని, వారి అభిప్రాయాలను విన్నాను. క్రమశిక్షణ పాటించవలసిందిగా వారిని కోరాను' అని జైట్లీ శుక్రవారం మీడియాతో చెప్పారు.
అయితే, రెడ్డి సోదరులు అరుణ్ జైట్లీని కలుసుకోలేదు. జనార్దనరెడ్డి జన్మదిన వేడుకలు జరుగుతున్న సమయంలోనే జైట్లీ బెంగళూరు వచ్చారు. జనార్దనరెడ్డి తన జన్మదినం సందర్భంగా తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామికి వజ్ర ఖచిత కిరీటాన్ని కానుకగా ఇచ్చారు. ఈ కిరీటం ఖరీదు రూ. 40 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తున్నది. ఇటీవలి కాలంలో తిరుమలేశునికి ఇచ్చిన అత్యంత ఖరీదైన కానుక ఇదే. హంపి రాజధానిగా 15వ శతాబ్దంలో పాలన సాగించిన విజయనగర రాజులు తిరుమల ఆలయానికి ఇచ్చిన కానుకలతో కొందరు దీనిని పోలుస్తున్నారు కూడా. బళ్లారి జిల్లాలోనే హంపి ఉన్నది.
రెడ్డి సోదరులకు, యెడ్యూరప్పకు మధ్య స్పర్థలు ఈ వారంలో పరాకాష్ఠకు చేరుకున్నాయి. ఇందుకు నాంది గడచిన 15 రోజులలో పడింది. బిజెపి ప్రభుత్వం తొలి వార్షికోత్సవాలను వారు బహిష్కరించారు. ముఖ్యమంత్రి ఢిల్లీకి అధికారిక పర్యటన జరిపినప్పుడు బ్రేక్ ఫాస్ట్ సమావేశాలను కూడా వారు బహిష్కరించారు. అయితే, బెంగళూరులో యెడ్యూరప్ప మంత్రివర్గ సమావేశానికి వారు హాజరైనప్పటికీ, కరుణాకరరెడ్డి తిరిగి మంగళవారం తనదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు. డిప్యూటీ కమిషనర్లతో ముఖ్యమంత్రి నిర్వహించిన చర్చలకు ఆయన హాజరు కాలేదు. కాని ఆ ముందు రోజే ఆయన వారితో విడిగా సమావేశం జరిపారు.
Pages: 1 -2- News Posted: 13 June, 2009
|