అంతా సాటిలేని మంత్రులే!
న్యూఢిల్లీ : మన్మోహన్ ఇన్ కార్పొరేషన్ బృందం ఏ బహుళ జాతీయ సంస్థ (ఎంఎన్ సి)కైనా కలల బృందం కాగలదు. ప్రతి ఒక్కరి జీవిత విశేషాలు విశిష్టమైనవే. ఆ బృందంలోని కీలక సభ్యులు దీటైన వారే. కేంబ్రిడ్జిలో చదువుకున్న ఆర్థికవేత్త 78 సంవత్సరాల డాక్టర్ మన్మోహన్ సింగ్ సారథ్యంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) మంత్రి మండలిలో హార్వర్డ్, వార్టన్, స్టాన్ ఫర్డ్, ఎంఐటి, కార్నెగీ మెలన్, ఆక్స్ బ్రిడ్జి వంటి ఐవీ లీగ్ యూనివర్శిటీల నుంచి పట్టభద్రులైన మంత్రులు కనీసం 14 మంది ఉన్నారు. యుఎస్ విశ్వవిద్యాలయాల నుంచి డిగ్రీలు తీసుకున్న మంత్రివర్గ సభ్యులు కూడా ఉన్నారు.
ఆ బృందం యోగ్యతలకు ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో వోటర్ల ఆమోద ముద్ర లభించింది. అయితే, విద్యపరంగా అంత విశిష్టులతో కూడుకున్న మంత్రి మండలి మేలైన పాలనను అందించి, ఆర్థిక సంస్కరణలను విజయవంతంగా అమలుపరచగలదా లేదా అనేది వేచి చూడవలసి ఉంటుంది. ప్రధాని మన్మోహన్ సింగ్ స్వయంగా కేంబ్రిడ్జి, ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయాలు రెండింటిలోను చదువుకున్న విశిష్టత ఉన్న నేత. ఆయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్ లో డిగ్రీని, ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని నుఫీల్డ్ కాలేజి నుంచి ఎకనామిక్స్ లో డిఫిల్ పొందారు.
ప్రస్తుత మంత్రి మండలిలో హార్వర్డ్ పూర్వ విద్యార్థులు ఎక్కువ మందే ఉన్నారు. పి. చిదంబరం నుంచి జ్యోతిరాదిత్య సింధియా, కపిల్ సిబల్ వరకు అక్కడ చదువుకున్నవారే. ఐవీ లీగ్ పూర్వ విద్యార్థులకు తోడుగా శశి థరూర్ వంటి పిహెచ్ డిలు కూడా కొందరు మంత్రి మండలిలో ఉన్నారు. జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్ వంటి యంగ్ టర్క్ లు కూడా అమెరికాలో చదువుకున్నారు. అందువల్ల వంద కోట్లకు పైగా జనాభా గల, అసలు బడి ఎలా ఉంటుందో తెలియని వారు అత్యధిక సంఖ్యలో ఉన్న దేశంలో విదేశాలలో మేలి ముత్యాలనదగిన విశ్వవిద్యాలయాలలో రాటు దేలిన నేతలు మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారన్నమాట.
'ఇండియా ఆఫ్టర్ గాంధి' గ్రంథ రచయిత, ప్రముఖ చారిత్రకవేత్త రామచంద్ర గుహ ఇలా అంటున్నారు. 'ఈ మంత్రులలో చాలా మంది ఇండియాలో చదువుకుని తమ పరిజ్ఞానానికి పదును పెట్టుకోవడానికి విదేశాలకు వెళ్ళారు. అందువల్ల వారి మూలాలు దేశ వాస్తవికతలో ఉన్నాయి. ప్రపంచంలో పరిస్థితుల పట్ల కూడా అవగాహన ఉంది'. అయితే, విశిష్ట అర్హతలు ఉన్నంత మాత్రాన సరిపోదు. తామేదైనా చేయగలమనే స్ఫూర్తికి తగినట్లుగా క్రియ ఉండాలి.
కాగా, 'ఇది మార్పు తీసుకువచ్చే మంత్రివర్గం కాగలదని ఆశిద్దాం. కావలసింది పని జరగడం. మనం మంచివారుగా భావించిన వ్యక్తులు మన ఆశలను కల్లలు చేశారు. ప్రపంచాన్ని నడిపించేది మంచి అభిప్రాయాలు కాదని, చేతల్లో చూపగలిగిన, ఆలోచనలను క్రియాత్మకం చేయగల శక్తి అనేది ముఖ్యంగా గ్రహించాలి. ఇది భారతీయులకు తేలికగా అలవడదు' అని ప్రోక్టర్ అండ్ గాంబుల్ సంస్థ మాజీ సిఇఒ, 'ఇండియా అన్ బౌండ్' గ్రంథ రచయిత గురుచరణ్ దాస్ పేర్కొన్నారు.
Pages: 1 -2- News Posted: 13 June, 2009
|