ఆస్ట్రేలియాలో మిర్చి మసాలా!
మెల్బోర్న్ : ఆస్ట్రేలియాలో తమపై వరుసగా దాడులు జరుగుతున్నప్పటికీ ఏమాత్రం వెరవకుండా భారతీయ విద్యార్థులు తమపై దాడికి ఉపక్రమించేవారిని ఎదుర్కొనడానికి మిర్చి పొడిని, మిరియాల స్ప్రేను తమ వెంట తీసుకువెళుతున్నారు. ఆత్మ రక్షణ పద్ధతులలో శిక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ కోర్సులలో చేరేందుకు కూడా వారు సిద్ధపడుతున్నారు. 'నా ఆస్ట్రేలియన్ మిత్రుల సలహాపై నేను కొన్ని రోజులుగా మిరియాల స్ప్రేను వెంట ఉంచుకుంటున్నాను' అని 24 సంవత్సరాల సందీప్ శనివారం తెలియజేశాడు. అతను తన ఇంటి పేరు చెప్పడానికి నిరాకరించాడు. మరి ఇద్దరు విద్యార్థులు ప్లాస్టిక్ ప్యాకెట్లలోని మిర్చి పొడిని చూపించారు. వారు దానిని తమ జాకెట్ల జేబులలో దాచుకున్నారు.
'మిర్చి మసాలా' అనే హిందీ చిత్రంలో ప్రధాన పాత్రలు ఇదే విధంగా ఆత్మ రక్షణ పద్ధతులను అనుసరించాయి. భారతీయ విద్యార్థులపై వరుసగా జరుగుతున్న దాడులను నిరోధించడంలో ఆస్ట్రేలియన్ నగరాలలోని పోలీసులు విఫలురు కావడం వల్ల గాని, అందుకు 'విముఖంగా' ఉండడం వల్ల గాని తాము ఈ అసాధారణ ఆత్మ రక్షణ పద్ధతులను అనుసరించవలసి వస్తున్నదని వారు వివరించారు.
'ఏ చట్టాలనూ ఉల్లంఘించకుండానే తమను తాము రక్షించుకునేందుకు' వీలుగా ఆత్మరక్షణ పద్ధతులలో భారతీయ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి మెల్బోర్న్ లో ఒక ఆస్ట్రేలియన్ మార్షల్ ఆర్ట్స్ ప్రవీణుడు ముందుకు వచ్చినట్లు ఆస్ట్రేలియాలోని భారతీయ విద్యార్థుల సమాఖ్య (ఎఫ్ఐఎస్ఎ) వ్యవస్థాపకుడు గౌతమ్ గుప్తా తెలియజేశారు.
Pages: 1 -2- News Posted: 14 June, 2009
|