ఫలించని టైగర్ వ్యూహం
న్యూఢిల్లీ : శ్రీలంకలో 30 సంవత్సరాలుగా సాగుతున్న అంతర్యుద్ధంలో తన తదుపరి వ్యూహాన్ని రూపొందించుకోవడానికి ఎల్ టిటిఇ అధిపతి వేలుపిళ్ళై ప్రభాకరన్ భారతదేశంలో ఎన్నికల ఫలితాల ప్రకటన కోసం నిరీక్షించాలనుకున్నాడు. కేంద్రంలో ఎన్ డిఎ లేదా తృతీయ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటవుతుందనే ఆశతో అతను ఉన్నాడు. కాని లంక సైన్యం ఆలోచనలు వేరేగా ఉండడంతో 'పెద్దపులి' వ్యూహం ఫలించలేదు.
తన భవిష్యత్తును, తన సంస్థ భవిష్యత్తును నిర్ణయించేందుకు లోక్ సభ ఎన్నికలు ఫలితాలు వెలువడే మే 16 వరకు వేచి ఉండాలని 54 సంవత్సరాల గెరిల్లా నేత ప్రభాకరన్ అనుకున్నట్లు, కాని అతను తప్పించుకునే మార్గాలన్నిటినీ శ్రీలంక సైన్యం అప్పటికే మూసివేసిందని ఇప్పుడు తెలియవచ్చింది.
'ఎవరైనా జోక్యం చేసుకుని తాను చిక్కుకుపోయి ఉన్న 'కాల్పుల నిరోధ మండలం'లోకి సైన్యం ప్రవేశించకుండా ఆపుతారని మే 16 వరకు అతను (ప్రభాకరన్) ఆశతో ఉన్నాడు' అని శ్రీలంక సైనిక వర్గాలు తెలియజేశాయి.
ప్రభాకరన్ పట్ల, ఎల్ టిటిఇ పట్ల విరోధ భావం ఉన్న కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం తథ్యమని గ్రహించిన అనంతరం తమ నిర్బంధంలో ఉన్న పౌరులనందరినీ సురక్షిత ప్రదేశాలకు వెళ్ళనిస్తామని ఎల్ టిటిఇ మే 16 మధ్యాహ్నం ప్రకటించింది. తమిళనాడులో తనకు అనుకూలంగా ప్రజా ఉద్యమం ప్రారంభం కాగలదని, తృతీయ ఫ్రంట్ లేదా ఎన్ డిఎ కేంద్రంలో అధికారాన్ని చేపట్టగలదని ఎల్ టిటిఇ ఆశించిందని శ్రీలంకలో ఒక తమిళ పార్టీ ప్రతినిధులు తెలిపారు. 'ఎన్నికల ఫలితాలు ప్రభాకరన్, ఆ సంస్థ ఇతర నాయకుల ఆశలను భగ్నం చేశాయి. కాని వారికి మరేదైనా వ్యూహం రూపొందించేందుక వ్యవధి లేకపోయింది. అప్పటికే వారు సైన్యం దిగ్బంధంలోకి వెళ్ళిపోయారు' అని ఆ ప్రతినిధులు వివరించారు.
Pages: 1 -2- News Posted: 14 June, 2009
|